సెజ్ భూములు కుల సంఘాలకు ఇస్తున్నారని..సర్పంచ్, ఉప సర్పంచ్​ నిర్బంధం

సెజ్ భూములు కుల సంఘాలకు ఇస్తున్నారని..సర్పంచ్, ఉప సర్పంచ్​ నిర్బంధం

నందిపేట, వెలుగు: సెజ్ ​భూములను కుల సంఘాల భవన నిర్మాణాలకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్​ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో సోమవారం గ్రామ యువకులు సర్పంచ్​ మూడ సుమలత, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సెక్రటరీలను జీపీ ఆఫీసులో నిర్బంధించారు. పోతరాజుల సంఘం, టేకేదార్​ల సంఘంతో పాటు మరో రెండు కుల సంఘాలకు చెందిన వారు భవన నిర్మాణాలకు స్థలం కేటా యించాలని ఇటీవల ఎమ్మెల్యే జీవన్​రెడ్డిని కోరారు. ఆయన సూచన మేరకు లక్కంపల్లి పంచాయతీలో ఆయా కుల సంఘాల వారు స్థలం కోసం అర్జీ పెట్టుకున్నారు. 

దీంతో సోమవారం జీపీలో పాలకవర్గం అనుమతి లేకుండానే సర్పంచ్​ సుమలత, ఉప సర్పంచ్​ శ్రీనివాస్, సెక్రెటరీ రమేశ్, కారోబార్ ​కిషన్​ కలిసి తీర్మానిస్తున్నారని భావించిన యువకులు, వారిని ఆఫీస్​లో ఉంచి బయటి నుంచి తాళం వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని తాళం తీయించారు. ఈ సందర్భంగా యువకులకు... సర్పంచ్, ఉప సర్పంచ్​తో వాగ్వాదం జరిగింది. యువకులు, గ్రామ మహిళలు మాట్లాడుతూ సెజ్​ఏర్పాటు చేసి తమకు ఉద్యోగాలిస్తామని 2008లో తమ భూములు తీసుకున్న ప్రభుత్వం.. 

ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి భూములను ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే ఉద్యోగాలు వస్తాయని భావించి తక్కువ ధరకే భూములు ఇచ్చామన్నారు. ఇప్పుడు కుల సంఘాలకు ఇస్తామంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం కేటాయించాలని దరఖాస్తులు వచ్చిన మాట నిజమేనని, కానీ భూమి కేటాయించడం తమ పరిధిలో లేదని, ఏపీఐఐసీ పరిధిలో ఉంటుందని సర్పంచ్​ మూడ సుమలత వివరణ ఇచ్చారు..