- ప్రతి ఐదేండ్లకు రిజర్వేషన్ మారేలా రొటేషన్ పద్ధతి
- రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్ల గెజిట్.. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
- డిసెంబర్లో ఎలక్షన్లు: మంత్రి సీతక్క వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా రిజర్వేషన్లను 50 శాతం పరిమితితో ఖరారు చేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ గురువారం సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లిస్టును సిద్ధం చేయనున్నది. శుక్ర, లేదా శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ నివేదికను ప్రభుత్వం పంపించనుంది. రిజర్వేషన్ల జాబితా జిల్లాలకు చేరిన వెంటనే, కలెక్టర్లు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారు. రెండ్రోజుల్లోనే జిల్లాస్థాయి యంత్రాంగం పరిశీలన పూర్తి చేసి, అధికారికంగా రిజర్వేషన్ల గెజిట్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది.
అనంతరం ఏ గ్రామంలో సర్పంచ్ పదవి ఏ వర్గానికి దక్కింది, వార్డు సభ్యుల స్థానాలు ఎవరెవరికి కేటాయించారనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు తగ్గట్టుగా 50 శాతంలోపే రిజర్వేషన్లు ఉండేలా.. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా, పకడ్బందీగా ఈ జాబితాను కలెక్టర్లు రూపొందించనున్నారు. డెడికేటెడ్ కమిషన్ కూడా ఆ మేరకే నివేదికను అందించింది. రిజర్వేషన్లపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెల 25న లేదంటే 26న పంచాయతీ ఎన్నికల నగరా మోగేలా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
రిజర్వేషన్లు ఇలా..
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా లేదా మండలం యూనిట్‌గా తీసుకొని.. ఎస్సీ, ఎస్టీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న గ్రామాల జాబితాను సిద్ధం చేస్తారు. ఆ జాబితాలో టాప్‌లో ఉన్న గ్రామాలను ఆయా వర్గాలకు కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక మండలంలో 20 పంచాయతీలు ఉండి, అక్కడ ఎస్టీ జనాభా శాతం ప్రకారం 4 సీట్లు రావాల్సి ఉంటే.. ఆ మండలంలో గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న మొదటి 4 గ్రామాలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ఎస్సీల విషయంలోనూ ఇదే పద్ధతి పాటిస్తారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో (1/70 చట్టం అమల్లో ఉన్న చోట) సర్పంచ్ స్థానాలన్నీ నూటికి నూరు శాతం గిరిజనులకే రిజర్వ్ అవుతాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా అత్యధికంగా ఉండి, రిజర్వేషన్ మారే అవకాశం లేని చోట మాత్రం పాత రిజర్వేషనే కొనసాగే చాన్స్ ఉంటుంది. మిగతా చోట్ల జనరల్ నుంచి రిజర్వ్‌డ్‌కు, రిజర్వ్‌డ్ నుంచి జనరల్‌కు సీట్లు మారుతాయి. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఖరారు చేయనున్నారు.
బీసీల్లో ఏ, బీ, సీ, డీ అనే వర్గీకరణ పంచాయతీ ఎన్నికల్లో ఉండదు. అందరినీ బీసీలుగానే పరిగణిస్తారు. కాగా, మొత్తం రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) మొత్తం 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం సీట్లు ఇచ్చాక.. మిగిలిన కోటాలో మాత్రమే బీసీలకు సీట్లు సర్దుబాటు చేస్తారు. సాధారణంగానే బీసీలకు 23 శాతం దాకా వస్తుంది. ఇక మొత్తం సీట్లలో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ.. ఇలా ప్రతి కేటగిరీలోనూ సగం సీట్లు మహిళలకు కేటాయించి, లాటరీ ద్వారా వార్డులు, గ్రామాలను రిజర్వ్ చేయనున్నారు.
రొటేషన్ పద్ధతిలో..
ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపులో ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నది. గతంలో మాదిరిగా కాకుండా.. ప్రతి ఐదేండ్లకు ఒకసారి రిజర్వేషన్లు కచ్చితంగా మారేలా ‘రొటేషన్’ పద్ధతిని అమలు చేస్తున్నది. దీనివల్ల ఒకే వర్గానికి చెందిన వారు లేదా ఒకే కుటుంబం ఏళ్ల తరబడి పదవుల్లో కొనసాగే అవకాశం ఉండదు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని, అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి ఏ స్థానం కేటాయించారో పరిశీలించి, దానికి భిన్నంగా ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం కొత్త రిజర్వేషన్లను ఖరారు చేశారు.
ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: ఎస్‌ఈసీ
ఏ క్షణమైనా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఎన్నికల సన్నద్ధతపై గురువారం సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఎలక్షన్ కమిషన్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల జాబితా సవరణలాంటి అంశాలపై కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నట్టు తెలిపారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక షెడ్యూల్ ప్రకటిస్తామని, దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు శాఖను కూడా ఆదేశించారు. రెండు విడతల్లో ఎన్నికలు జరపవచ్చా? లేదా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనేదానిపై చర్చ జరిగింది. ఎక్కువ మంది మూడు విడతల్లో ఎన్నికలు జరపాలని సూచించినట్లు తెలిసింది. డిసెంబర్ రెండోవారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించే అవకాశం ఉంది.
