ఎన్నికల కోసం చేసిన అప్పు తీర్చలేక సర్పంచ్ ​భర్త ఆత్మహత్య

ఎన్నికల కోసం చేసిన అప్పు తీర్చలేక సర్పంచ్ ​భర్త ఆత్మహత్య

వేల్పూర్, వెలుగు : ఎన్నికల కోసం చేసిన అప్పులు వడ్డీలు పెరిగి, కట్టే దారి లేక పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ సత్తమ్మ భర్త మల్లేశ్​బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకోగా గురువారం చనిపోయాడు. వేల్పూర్ మండలంలో కొత్తగా ఏర్పడిన పడగల్ ఒడ్డెర కాలనీకి 2018లో ఎన్నికలు జరగ్గా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ​లీడర్ ​మల్లేశ్ ​తన భార్య సత్తెమ్మను పోటీలో నిలిపి గెలిపించుకున్నాడు. అయితే ఎన్నికల ఖర్చు కోసం లక్షల్లో అప్పు చేశాడు. వ్యవసాయం చేసే మల్లేశ్​ ఈ మధ్యే అప్పు తెచ్చి పౌల్ట్రీ ఫాం పెట్టాడు.  గ్రామ పంచాయతీకి కూడా రూ. 87,000 బకాయి పడ్డాడు. రాను రాను అప్పులు పెరగడం, అవి ఎలా తీర్చాలో తెలియక బుధవారం పురుగుల మందు తాగి అత్మహత్యాయత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆర్మూర్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వేల్పూర్ ఎస్ఐ వినయ్ తెలిపారు. 

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి
వేల్పూర్ మండలం వడ్డెర కాలనీలో అత్మహత్య  చేసుకున్న సర్పంచ్ సత్తమ్మ భర్త మల్లేశ్ కుటుంబాన్ని బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు. సర్పంచ్ భర్త ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రాష్ర్ట ప్రభుత్వం సర్పంచుల మీద ఆర్థికంగా భారం మోపుతోందని, దీంతో చాలా మంది సర్పంచులు అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పంచాయతీ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.