గత ప్రభుత్వంలో సర్పంచ్​లు గోసవడ్డరు : కోదండరాం

గత ప్రభుత్వంలో  సర్పంచ్​లు గోసవడ్డరు : కోదండరాం
  • అప్పులు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి పనులు చేసిన్రు: కోదండరాం 
  • అప్పటి సర్కార్ బిల్లులు చెల్లించక ఇబ్బందులకు గురిచేసిందని ఫైర్ 
  • పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి సర్పంచ్​ల విజ్ఞప్తి 
  • సర్పంచ్​ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్​లను ఇబ్బందులకు గురిచేసిందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదం డరాం మండిపడ్డారు. ‘‘అప్పులు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి సర్పంచ్​లు ఊర్లలో పనులు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం బిల్లులు విడుదల చేయలేదు. దీంతో సర్పంచ్​లు గోసవడ్డరు” అని అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో సర్పంచ్ ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కేసీఆర్ పాలనలో సర్పంచ్​ల అప్పులు, ఆత్మహత్యలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. లోకల్ బాడీలకు నిధులు ఇస్తేనే, అవి డెవలప్ అవుతాయని అన్నారు. ‘‘గత ప్రభుత్వంలో ఊర్లో ఏ తప్పు జరిగినా సర్పంచ్​లపైనే చర్యలు తీసుకున్నారు. మొక్క చనిపోయినా, చెత్త ఉన్నా సర్పంచ్​లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సస్పెన్షన్లు కూడా చేశారు. దీంతో ఆత్మగౌరవంతో బతకాల్సిన సర్పంచ్​లు ప్రభుత్వానికి భయపడుతూ బతికారు” అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సమస్యలు వింటుందని, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. సర్పంచ్​ల పోరాటానికి మద్దతు ఇస్తానని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. ‘‘గత ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించింది.

నిధులు ఇవ్వకుండా సర్పంచ్​లను ఇబ్బంది పెట్టింది. పెండింగ్ బిల్లులు రాక, కొంతమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం” అని అన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయటంతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు పర్సన్ ఇన్ చార్జ్​లుగా ప్రస్తుత సర్పంచ్​లను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సర్పంచ్​ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి తెలిపారు. ‘‘జాయింట్ చెక్ పవర్ రద్దు చేయడం, పెండింగ్ బిల్లులు చెల్లించడం, ఎన్నికల వరకు పర్సన్ ఇన్ చార్జులుగా కొనసాగించడం.. అనే మూడు ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్తాను” అని చెప్పారు. 

బిల్లులు చెల్లించాలె.. 

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సర్పంచ్​లు కోరారు. జాయింట్ చెక్ పవర్ రద్దు చేయడంతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు తమను పర్సన్ ఇన్ చార్జులుగా కొనసాగించాలని కోరారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామని సర్పంచ్​ల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ సౌధాని భూమన్న యాదవ్ అన్నారు. అప్పులు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి పనులు చేశామని.. కానీ బిల్లులు చెల్లించకుండాపెండింగ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్​లను ఎంతో గోస పెట్టిందని సర్పంచ్​ల సంఘం మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి అన్నారు. సర్పంచ్​లు ఆత్మహత్యలు చేసుకుంటే, వ్యక్తిగత కారణాలతో చనిపోయారని అప్పటి మంత్రులు చెప్పటం దారుణమన్నారు.