
- నిధులు లేకుండా ప్లాన్ ఎట్ల?
- పనులు జరగకుంటే బలయ్యేది మేమే
- 30 రోజుల ప్లాన్ మీటింగ్‌లో సర్పంచ్‌ల నిలదీత
పంచాయతీలకు పైసా ఇవ్వలేదు… ఏ పని జరగకున్నా సర్పంచ్‌లను బలి చేసేలా ఉందంటూ 30 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం రూల్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటకుంటే సస్పెండ్ చేస్తారా..? మేమేమన్నా.. మీ ఇంటి నౌకర్లమా? అని ప్రశ్నించారు. యాక్షన్ ప్లాన్‌పై భువనగిరి, ఆలేరులో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు బుధవారం అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కలెక్టర్ అనితా రామచంద్రన్, జేసీ రమేశ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి వారికి దిశానిర్దేశంచేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ హరితహారం విషయంలో సర్కారు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు జాగాలేని గ్రామాల్లో మొక్కలు ఎక్కడ నాటాలని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్న భూమిలో మొక్కలు నాటుతుంటే.. కోతులు పీకేస్తున్నాయని.. ఈ సమస్య ఎందుకు తీర్చడం లేదన్నారు. కొత్త పంచాయతీల్లో బిల్డింగ్ కిరాయి కూడా కట్టలేని స్థితిలో ఉన్నామన్నారు. గ్రామాల్లో స్థలమే లేనప్పుడు శ్మశానవాటికలు ఎట్ల నిర్మించాలన్నారు. ప్రభుత్వం భూమిని కొనిస్తే గానీ నిర్మించలేమన్నారు. మనుషులను కరుస్తున్న కుక్కలను చంపిస్తే కూడా సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తారా? అంటూ నల్గొండలో సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ 30 రోజుల యాక్షన్ ప్లాన్ సర్పంచ్‌లను బలి చేసే విధంగా ఉందన్నారు. సక్సెస్ అయితే సర్కారుకు పేరు.. విఫలమైతే సర్పంచ్‌లపై చర్యలా? ఇదేం విధానం నిలదీశారు.