పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల ఆందోళనలు 

పెండింగ్ బిల్లుల కోసం సర్పంచుల ఆందోళనలు 

రాష్ట్రంలో సర్పంచులు పరిస్థితులు చాలా దారుణంగా ఉంది. గ్రామ పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే అయిదారు నెలలుగా బిల్స్ రావడం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి చాలా మంది సర్పంచులు అప్పులపాలయ్యారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచులంతా హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమౌతున్నారు. బిల్లులైనా టైంకి మంజూరూ చేయండి.. సూసైడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు.

మంచిర్యాల  జిల్లాలో

మంచిర్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామ డెవలప్మెంట్ కోసం అప్పులు చేసి లక్షల్లో ఖర్చు పెడితే ప్రభుత్వం నుంచి పైసా కూడా రాలేదంటున్నారు సర్పంచులు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం MPDO, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. 

మెదక్ జిల్లాలో 

ఉమ్మడి మెదక్ జిల్లాలో అభివృద్ది కోసం పనులు చేయించిన సర్పంచులు అప్పుల పాలై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో బిల్లులు నిలిచిపోయాంటున్నారు. స్మశానవాటికలు, పంచాయతీ బిల్స్, పల్లె ప్రకృతి వనాలు, CC రోడ్లు, మురుగు కాలువలకు సంబంధించిన బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్ లోనే ఉన్నాయని సర్పంచులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ బకాయిల విడుదల కాకపోవడంతో సర్పంచులు అప్పులపాలయ్యారు. బిల్లుల కోసం సర్పంచులు నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. అభివృద్ది పనుల కోసం లక్షల్లో అప్పుల చేశామని... ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.