కేంద్ర నిధులపై మీ పెత్తనమేంది?

కేంద్ర నిధులపై మీ పెత్తనమేంది?
  • రాష్ట్ర ప్రభుత్వంపై సర్పంచ్​ల ఆగ్రహం
  • ఆర్థిక సంఘం నిధులతో యాక్షన్​ ప్లాన్
  • రూ. 339 కోట్లలో రూ. 203 కోట్లు కేంద్రానివే

హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ఆర్థిక సంఘం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించి మిగతా పథకాలకు వినియోగిస్తోందని పలువురు సర్పంచ్​లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 30 రోజుల పంచాయతీ యాక్షన్​ ప్లాన్​ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 30 రోజుల పాటు గ్రామాల్లో పారిశుధ్యం, శుభ్రత, విద్యుత్​..  ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఈ నెల 6 న ప్రారంభమైన ఈ పథకంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడంలేదు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ఈ పథకానికి సర్కారు  కేంద్ర ఆర్థిక సంఘం నిధులను వాడుతోంది. దీనిపై సర్పంచులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంచాయతీల అభివృద్ధికి ఇస్తున్న నిధులను ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

దేనికి ఉపయోగించాలి?

గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణం(50శాతం), వీధి లైట్లు(10శాతం), పారిశుధ్య కార్యక్రమాలు(15శాతం), తాగునీరు(10 శాతం), ఆపరేషన్స్, మెయింటనెన్స్(10 శాతం), అన్​సీన్​ ఖర్చుల(5 శాతం)కు ఈ నిధులను ఖర్చుచేయాలి. అయితే, నీతి అయోగ్​ సిఫారసు చేసినా మిషన్​ కాకతీయ, భగీరథ పథకాలకు కేంద్రం నిధులివ్వడంలేదు. దీంతో పంచాయతీలకు ఇచ్చిన నిధులు సహా ఇతర పథకాలకు వచ్చిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం వాటికి మళ్లిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

యాక్షన్​ ప్లాన్​కు కేంద్ర నిధులా ?

రాష్ట్ర పథకాలపై కేంద్ర పెత్తనమేంటని సీఎం కేసీఆర్  పలుమార్లు ప్రశ్నించారు. మరి కేంద్ర నిధులపై రాష్ట్ర పెత్తనం ఏంటి? యాక్షన్​ ప్లాన్​ అమలుకు ఆర్థిక సంఘం నిధులెట్ల వాడుతరు? దీనికోసం రాష్ట్ర సర్కారు విడుదల చేసిన రూ.339 కోట్లలో రూ. 203 కోట్లు ఆర్థిక సంఘం నిధులే.. వీటిపై హక్కు పంచాయతీలకే ఉంది. – ప్రణీత్ చందర్, సర్పంచ్, నసురుళ్లబాద్, జడ్చర్ల మండలం.

sarpanhes angry that TS Government diverted funds from the Central Economic Commission