
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో వైరస్ విజృంభిస్తోంది. ఇకపోతే, గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి యూఎస్‌లోని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) క్లారిటీ ఇచ్చింది. గాలి ద్వారా కరోనా వ్యాప్తి అవడం, ఇతరులకు సోకుతుందనేది నిజమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కొవిడ్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా అనే విషయంపై లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో సీడీసీ పరిశోధనపై ఓ కథనం ప్రచురితమైంది. దీని ప్రకారం.. కరోనా వ్యాప్తి చెందే విధానం మారిపోయింది. గాలిని పీల్చే సమయంలో శ్వాస ద్రవాలు విడుదలు అవుతుంటాయి. మాట్లాడుతున్నప్పుడు, ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు, తుమ్మేటప్పుడు శ్వాస ద్రవాలు విడుదలవుతుంటాయి. ఈ శ్వాస ద్రవాలు వైరస్‌ను క్యారీ చేస్తాయని, మాస్కు వేసుకోకుంటే ఈ ద్రవాల ద్వారా కరోనా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని తేలింది. ఈ శ్వాస ద్రవాల్లోని వైరస్ బయట ప్రదేశాలపై పడటం వల్ల వాటిని తాకిన వారికి కూడా వైరస్ సోకుతుందని బయటపడింది.