
కేజీబీవీల్లో ఎస్‌ఎస్‌ఏ అధికారుల తీరు
పాత మెరిట్ లిస్ట్‌తో రిక్రూట్‌మెంట్
ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష పెట్టారు. మెరిట్ వచ్చినోళ్లకు ఉద్యోగాలిచ్చేశారు. ఇదంతా ఏడాది కిందటి ముచ్చట. ఇప్పటి ముచ్చటకొద్దాం. మళ్లీ వాళ్లకు ఉద్యోగులు అవసరం పడ్డరు. కానీ, నోటిఫికేషన్ఇవ్వలేదు. పరీక్ష పెట్టలేదు. మరి, ఎట్ల తీసుకుంటారు? ఏడాది కింద పరీక్ష పెట్టారు కదా.. అందులో తీసుకున్నవాళ్లు పోనూ, మెరిట్ సాధించిన మిగతా వాళ్లను తీసుకుంటారట. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అధికారుల తీరిది. అవును, పాత నోటిఫికేషన్‌తోనే కొత్తగా కొలువులను భర్తీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అట్లెట్లా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
900 పోస్టుల వరకూ ఖాళీ
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), పట్టణ గురుకుల స్కూళ్ల (యూఆర్‌ఎస్)లో ఖాళీల భర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు. సీఆర్‌టీ, ఎస్‌ఓ, పీఈటీ, ఇంటర్‌కు అప్‌గ్రేడైన 88 కేజీబీవీల్లో పీజీసీఆర్‌టీ సహా 1,050 పోస్టులను భర్తీ చేయాలనుకున్నారు. అదే ఏడాది జులై 2, 3, 4వ తేదీల్లో పరీక్షలు పెట్టారు. మంచి ర్యాంకులొచ్చినోళ్లకు ఉద్యోగాలూ ఇచ్చేశారు. అంతటితో ఆ నోటిఫికేషన్ పని అయిపోవాలి. అయితే ఈ ఏడాది కొత్తగా 84 కేజీబీవీలను పదో తరగతి నుంచి ఇంటర్‌కు, మరో కొత్త 84 కేజీబీవీలను 8 నుంచి 9వ తరగతికి అప్‌గ్రేడ్ చేశారు. కాలేజీకి అప్‌గ్రేడైన స్కూల్స్‌లో కొత్తగా ఆరు పోస్టులు, 9వ తరగతికి అప్‌గ్రేడైన ఒక్కో కేజీబీవీలో రెండేసి పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన 672 కొత్త పోస్టులు అవసరం పడ్డాయి. వీటితోపాటు ఇప్పటికే సుమారు 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. ఇలా మొత్తం కేజీబీవీల్లో 850 నుంచి 900 పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌ఏ కొత్తగా నోటిఫికేషన్‌ను ఇచ్చి, భర్తీకి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ 2018లో నిర్వహించిన పరీక్ష ఆధారంగానే, అప్‌గ్రేడ్ స్కూల్స్‌లో పోస్టులతోపాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. జూన్‌లో రిక్రూట్‌మెంట్ ప్రారంభించాలని డీఈఓలకు ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
డబ్బులు తీసుకుని చేస్తున్నరు
ఎస్‌ఎస్‌ఏ అధికారుల నిర్ణయంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. కొత్త ఉద్యోగాలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిపోయి పాత దాంట్లో నుంచి మిగిలిన అభ్యర్థులను మెరిట్, రోస్టర్ ప్రకారం ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందులో పెద్దస్థాయిలోనే అవినీతి జరిగి ఉంటుందని ఆరోపిస్తున్నారు. గతేడాది పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నారని, అందుకే కొత్తగా నోటిఫికేషన్ఇవ్వకుండా పోస్టులను భర్తీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేవలం నిధులు లేకపోవడం వల్లే కొత్త నోటిఫికేషన్ఇవ్వడం లేదని ఎస్‌ఎస్‌ఏ అధికారి ఒకరు తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టాలంటే రూ.1.5 కోట్లు కావాలన్నారు. అంతేకాకుండా మళ్లీ పరీక్ష నిర్వహించేంత వరకు పాత నోటిఫికేషన్‌తోనే పోస్టులు భర్తీ చేసుకునేలా ఆ నోటిఫికేషన్‌లోనే పేర్కొన్నట్టు వివరించారు. ఇప్పుడు కేవలం సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే జరుగుతోందని, పోస్టుల భర్తీ కాదని చెప్పారు.
టీచర్లు లేక కాలేజీల్లో అయోమయం
ఈ ఏడాది 84 కేజీబీవీలు కాలేజీలుగా అప్‌గ్రేడయ్యాయి. కానీ ఇప్పటికీ వాటిలో పోస్టులను ఇంకా భర్తీ చేయలేదు. అయితే ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారులు మాత్రం గెస్ట్ టీచర్లను తీసుకోవాలని డీఈఓలకు సూచించినా, తాత్కాలిక పోస్టులు కావడంతో ఆ పోస్టుల్లో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా కేజీబీవీ కాలేజీల్లో సబ్జెక్టుల టీచింగ్ ప్రారంభం కాలేదు. దీంతో కొందరు స్టూడెంట్స్ టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారని సమాచారం.