ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహం పెడతాం : శ్రీనివాస్ గౌడ్

ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహం పెడతాం  :   శ్రీనివాస్  గౌడ్

బషీర్ బాగ్, వెలుగు: సర్దార్  సర్వాయి పాపన్న ఆసియా ఖండంలోనే మొట్టమొదటి బహుజన చక్రవర్తి అని మంత్రి శ్రీనివాస్  గౌడ్  అన్నారు. పాపన్న బహుజన వాది అని మంత్రి పేర్కొన్నారు. సర్దార్  సర్వాయి పాపన్న మహరాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జైగౌడ్  ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ జాతీయ అధ్యక్షుడు రామారావు గౌడ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న గౌడ్  మహరాజ్ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాపన్న కేవలం గౌడ కులం కోసమే పోరాటం చేయలేదని, అన్ని కులాల కోసం పోరాటాలు చేశారన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపై అప్పట్లో ఎంతో వివక్ష ఉండేదో అర్థం అవుతుందన్నారు. 2003   వరకు సర్దార్  పాపన్న ఫొటో ఎలా ఉంటుందో తెలియదని, లండన్ ప్రొఫెసర్ల పరిశోధన కారణంగా ఆయన వీరత్వం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతి నిర్వహిస్తున్నదని తెలిపారు. 

ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ రాజకీయం, కులం వేరువేరు కాదన్నారు. గౌడ కులస్తులను అగ్రకుల రాజకీయ నాయకులు తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ గౌడ్లకు సముచిత స్థానం లభించడం లేదని, కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు అతీతం కాదన్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతి గ్రామంలోనూ పెట్టాలన్నారు.

 రాజమండ్రి వైసీపీ ఎంపీ భరత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాధికారం పాపన్న సిద్ధాంతమని అన్నారు. ఛత్రపతి శివాజీ , పాపన్న సమకాలీకులని, కానీ శివాజీకి దక్కిన గౌరవం పాపన్నకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పాపన్న ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందన్నారు.