పేదల కష్టాలను తెలుసుకోవడానికే సర్వోదయ సంకల్ప పాదయాత్ర

పేదల కష్టాలను తెలుసుకోవడానికే సర్వోదయ సంకల్ప పాదయాత్ర

గజ్వేల్: దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్రను మొదలుపెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. భూదాన్ ఉద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ చేపడుతున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ నియోజక వర్గం నుంచి గజ్వెల్ నియోజక వర్గం కాళ్ళకల్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... భూమిలేని నిరుపేదల కోసం 75 ఏళ్ల కిందట వినోబా భావే ఈ ప్రాంతం నుంచే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. ఈ క్రమంలో దళితులు, గరిజనులు, ఇతర నిరుపేదలకు  వినోబా భావే వందల ఎకరాల భూమిని పంచిపెట్టారన్నారు.

కేసీఆర్ పాలనలో రైతుల భూమికి విలువలేకుండా పోయిందన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల వేలాదిమంది నిరుపేదలు నిరాశ్రయులైతే కేసీఆర్ పట్టించుకోవడంలేదన్నారు. కొండపోచమ్మ ద్వారా పేదలకు నీళ్లియ్యడంలేదని, తన ఫాం హౌజ్ కు ఆ నీళ్లను కేసీఆర్  తోడుకపోతున్నారని మండిపడ్డారు. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఎకరాకు రూ.5 కోట్ల విలువున్న భూములకు రూ.10 లక్షలు ఇస్తామంటూ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్.. తన ఫాం హౌజ్ లో మాత్రం 150 ఎకరాల్లో వరి సాగు చేయడమేంటని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల