అవధూత్ సాథేకు 'శాట్' షాక్: ముందు రూ.100 కోట్లు డిపాజిట్ చేస్తేనే ఖాతాలు అన్‌ఫ్రీజ్

అవధూత్ సాథేకు 'శాట్' షాక్: ముందు రూ.100 కోట్లు డిపాజిట్ చేస్తేనే ఖాతాలు అన్‌ఫ్రీజ్

ప్రముఖ స్టాక్ మార్కెట్ ట్రైనర్ అవధూత్ సాథే, ఆయన ట్రేడింగ్ అకాడమీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ నుండి స్వల్ప ఊరట లభించినప్పటికీ, సెబీ వేసిన చిక్కుముడి మాత్రం ఇంకా వీడలేదు. గత ఏడాది డిసెంబర్ 4న సెబీ జారీ చేసిన కఠిన ఆదేశాలపై విచారణ జరిపిన ట్రిబ్యునల్, సాథేకు ఒక భారీ షరతును విధించింది. రూ.546 కోట్ల అక్రమ లాభాల రికవరీ కేసులో భాగంగా.. తక్షణమే రూ.100 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని సాథేను ఆదేశించింది.

సెబీ తన మధ్యంతర ఉత్తర్వుల్లో సాథే బ్యాంక్ ఖాతాలను, డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయడమే కాకుండా.. మార్కెట్లో ట్రేడింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది. అయితే తాజాగా సాథే అభ్యర్థనను విన్న శాట్.. ఈ ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగా రూ.100 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ మొత్తాన్ని సెబీ పేరిట 'లియన్' మార్క్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనను పాటిస్తేనే సాథే అకాడమీ తన బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను అమ్ముకోవటానికి అనుమతి లభిస్తుంది.

రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లేదా రీసెర్చ్ అనలిస్ట్ కాకుండానే సాథే తన విద్యార్థులకు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తున్నారని సెబీ ఆరోపించింది. ముఖ్యంగా డెరివేటివ్స్ మార్కెట్లో 10 మందిలో 9 మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతుంటే.. ఎటువంటి ఆర్థిక అవగాహన లేని విద్యార్థులకు ట్రేడింగ్ టిప్స్ ఇవ్వడం నేరమని సెబీ వాదించింది. తప్పుదోవ పట్టించే యాడ్ క్యాంపెయిన్స్ ద్వారా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో దాదాపు రూ.546 కోట్లను అక్రమంగా సాథే ఆర్జించారని సెబీ సభ్యుడు కమలేష్ చంద్ర వర్ష్ణే తన నివేదికలో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను అవధూత్ సాథే తరపు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. అకాడమీ నిర్వహణకు, పన్నుల చెల్లింపులకు, సామాజిక సేవా కార్యక్రమాలకే ఆ డబ్బు ఖర్చయిందని.. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాల్లో అంత మొత్తం లేదని కోర్టుకు తెలిపారు. సెబీ కేవలం కొన్ని వాట్సాప్ చాట్‌లను మాత్రమే ఆధారంగా తీసుకుందని, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించిందని విన్నవించారు. మెడికల్ సర్జన్లకు ప్రాక్టికల్ శిక్షణ ఎలా అవసరమో.. ట్రేడింగ్‌లో కూడా లైవ్ చార్టుల ద్వారా నేర్పించడం అంతకంటే ముఖ్యం అని సాథే తరపున లాయర్లు వాదనలు వినిపించారు.

ఈ కేసు మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక పెద్ద గుణపాఠం లాంటిది. సెబీ నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ అడ్వైజర్లు మాత్రమే పెట్టుబడి సలహాలు ఇవ్వాలి. సాథే రూ.100 కోట్లు డిపాజిట్ చేసి కంప్లయన్స్ అఫిడవిట్ దాఖలు చేసే వరకు ఆయన ఆస్తులపై పట్టు సెబీ చేతిలోనే ఉంటుంది. భారీ లాభాలు వస్తాయంటూ వచ్చే ప్రకటనలను నమ్మి ట్రేడింగ్ అకాడమీల్లో చేరే ముందు ఇన్వెస్టర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు.