పట్టాలివ్వడమే కాదు.. ఉద్యోగాలు సృష్టించాలి

పట్టాలివ్వడమే కాదు..  ఉద్యోగాలు సృష్టించాలి

‘‘స్టూడెంట్లు ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. అవే కొత్త ఇన్నొవేషన్స్​కు దారితీస్తాయి. ఈ ప్రక్రియ యూనివర్సిటీల్లో నిరంతరం కొనసాగాలి’’ అని నేషనల్‍ బోర్డ్ ఆఫ్‍ అక్రిడేషన్‍ (ఎన్‍బీఏ) చైర్మన్ కేకే అగర్వాల్ అన్నారు. గురువారం కరీంనగర్‍ జిల్లా కేంద్రంలోని శాతవాహన వర్సిటీ తొలి కాన్వొకేషన్​కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘యూనివర్సిటీలు కేవలం చదువులు చెప్పి పట్టాలివ్వడమే కాదు.. కొలువులు కూడా సృష్టించగలగాలి. ఒకే జాబ్‍ లో చేరి అక్కడే ఉండిపోకుండా కనీసం 10 ఉద్యోగాలు మారే నైపుణ్యాన్ని స్టూడెంట్లు అందిపుచ్చుకోవాలి. అలాంటి స్కిల్స్ ను స్టూడెంట్లకు నేర్పించడంలో వర్సిటీలు ముందుండాలి” అని సూచించారు.

మోనాలిసా నవ్వులో ఎంత ప్యూరిటీ ఉందో చెబుతున్నరు

భవిష్యత్‍ మొత్తం టెక్నాలజీదేనని కేకే అగర్వాల్ అన్నారు. ఇంటి నుంచి ఫోన్‍ సాయంతో సీటీ స్కాన్, ఇతర బ్లడ్‍ టెస్టులు వంటివి చేసుకుని డాక్టర్లకు పంపించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. నెదర్లాండ్స్​లో రైతులు సైన్స్, టెక్నాలజీని ఉపయోగించి తమ పంట పొలాల్లో కేవలం 10 శాతం నీటితో రెండున్నర రెట్లు ఎక్కువ పంట తీస్తున్నారని చెప్పారు. సాగులో ముందంజలో ఉన్న కరీంనగర్‍ వంటి ప్రాంతాలకు ఈ పద్ధతులు ఇంకా బాగా పనికివస్తాయన్నారు. తమ పంట పొలాల్లో ప్రయోగాలకు రైతులే సిద్ధపడుతుంటే వర్సిటీల్లో ఉన్న స్టూడెంట్లతో ఎందుకు ప్రయోగాలు చేయరాదని ప్రశ్నించారు. స్టూడెంట్లలో ప్రశ్నించే తత్వాన్ని పెంచాలని, అప్పుడే సరైన ఫలితాలు వస్తాయన్నారు. స్టాన్‍ఫోర్డ్ యూనివర్సిటీలో బీటెక్‍ను ఐదేళ్లకు పొడిగించారని, అక్కడ మ్యాథ్స్, మ్యూజిక్‍, కంప్యూటర్‍ సైన్సు వంటి సబ్జెక్టులను కలిపి చెబుతారన్నారు. కళల్లోనూ కంప్యూటర్‍ వచ్చేసిందని.. మోనాలిసా నవ్వులో ఎంత ప్యూరిటీ ఉందో చెప్పేంతగా పరిస్థితి తయారైందని ఆయన నవ్వులు పూయించారు. క్లాస్‍ లో పాఠాలు చెప్పే విధానంలోనూ మార్పులు రావాలని.. అవి స్టూడెంట్లలో నైపుణ్యం పెంచాలని సూచించారు. ప్రతి స్టూడెంట్ లాజికల్ గా ఆలోచించి ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. ఇన్‍చార్జ్​వీసీ చిరంజీవులు, వర్సిటీ రిజిస్ట్రార్‍ ఉమేశ్‍ కుమార్‍, ప్రొఫెసర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.