జకార్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి అద్భుత ప్రదర్శనతో ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఆయుష్ 8–21, 22–20, 21–15తో చైనాకు చెందిన 15వ ర్యాంకర్ హాంగ్ యాంగ్ వెంగ్‌పై సంచలన విజయం సాధించాడు.
మొదటి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌లో 11–15తో వెనుకబడిన దశలో ఆయుష్ అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి గాయం కారణంగా మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. మలేషియా జోడీతో మ్యాచ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే సాత్విక్ కుడి భుజం నొప్పితో ఇబ్బంది పడడంతో ఈ జంట వెనుదిరిగింది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-రుత్విక శివాని జోడీ 21-–14, 21–-14తో చైనీస్ తైపీ జోడీపై గెలిచి రెండో రౌండ్‌కు చేరింది. మిగతా మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 17– 21, 21–16, 19–21తో ఐర్లాండ్‌కు చెందిన నాట్ న్గుయెన్ చేతిలో ఓడిపోగా, మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 15–21, 14–21తో జపాన్ స్టార్ నోజోమి ఒకుహారా చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగే తదుపరి రౌండ్‌లో పీవీ సింధు అగ్రశ్రేణి క్రీడాకారిణి అన్ సే యంగ్‌ను ఢీకొట్టనుంది.
