బ్యాంకాక్: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో బోణీ చేసింది. మంగళవారం జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో వరల్డ్ నాలుగో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ 21–19, 21–23, 21–10తో ముహ్ పుత్రా ఎర్వియాన్షా–బగాస్ మౌలానా (ఇండోనేసియా)పై గెలిచారు. 64 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్లు తడబడి పుంజుకున్నారు. తొలి గేమ్‌లో 6–11తో వెనకబడ్డా వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి గేమ్‌లో నిలిచింది.
రెండో గేమ్‌లో ర్యాలీలు సుదీర్ఘంగా సాగడంతో బ్రేక్ తర్వాత సాత్విక్ ద్వయం తడబడింది. డిసైడర్‌లో తమ అనుభవాన్ని చూపెట్టిన సాత్విక్–చిరాగ్ వరుస పాయింట్లతో హోరెత్తించారు. బ్రేక్ వరకు 11–5 లీడ్‌లో నిలిచారు. ఆ తర్వాత కూడా స్మాష్‌లు, ర్యాలీలతో ఏకపక్షంగా పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.
విమెన్స్ డబుల్స్‌లో రుతపర్ణా–శ్వేత పర్ణా 9–21, 11–21తో లిన్ చిహు చున్–యాంగ్ చు యున్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు. మెన్స్ డబుల్స్‌లో హరిహరన్–ఎం.ఆర్. అర్జున్ 18–21, 20–22తో చెన్ జి రే–లిన్ యు చిహ్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓటమిపాలయ్యారు.
