ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి.. రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ 21-11, 21-17తో లీ జి హుయ్-యాంగ్ పో (చైనీస్‌తైపీ)పై గెలిచారు.
పారిస్: వరల్డ్ నంబర్ వన్, ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి అంచనాలను అందుకున్నారు. పారిస్ గడ్డపై మరోసారి అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ మెగా టోర్నీలో రెండోసారి మెన్స్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్ సాత్విక్–చిరాగ్ 21–11, 21–17తో లీ జి హుయ్–యాంగ్ పో సుయాన్ (చైనీస్‌తైపీ)పై గెలిచారు. ఇదే టోర్నీలో 2022లో తొలి టైటిల్ సాధించిన సాత్విక్–చిరాగ్.. 2019లో రన్నరప్‌గా నిలిచారు. ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు వచ్చి మరోసారి టైటిల్ వేసుకున్నారు. ఈ సీజన్‌లో సాత్విక్–చిరాగ్‌కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ఒలింపిక్ టెస్టింగ్ ఈవెంట్ అయిన ఈ టోర్నీలో ఒక్క గేమ్ కోల్పోకుండా విజేతలుగా నిలిచారు. దాంతో పారిస్‌లోనే జరిగే ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ ఫేవరెట్లుగా బరిలో దిగనున్నారు. ఇక, బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో సూపర్ 300 అంతకంటే మెరుగైన ఈవెంట్లలో సాత్విక్–చిరాగ్‌కు ఓవరాల్‌గా ఇది ఏడో టైటిల్.
37 నిమిషాల్లోనే ఖేల్ ఖతం..
ఆట ఆరంభం నుంచే పదునైన స్మాష్‌లు, బలమైన క్రాస్ కోర్టు విన్నర్లతో చెలరేగిన ఇండియా ద్వయం 37 నిమిషాల్లోనే ప్రత్యర్థుల ఆట కట్టించింది. తొలి గేమ్‌లో ఇరుజట్ల స్కోరు 4–4తో సమమైన తర్వాత సాత్విక్–చిరాగ్ వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 9–4 లీడ్‌లో నిలిచారు. తర్వాత రెండు, నాలుగు పాయింట్లతో ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకున్నారు. చైనీస్‌తైపీ జోడీ ఒకటి, రెండు పాయింట్లకే పరిమితమయ్యారు. స్కోరు 17–10 వద్ద సాత్విక్ జోడీ నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సాధించింది. రెండో గేమ్‌లో లీ జీ–సుయాన్ కాస్త తేరుకున్నారు. నెట్స్ వద్ద డ్రాప్ షాట్స్ వేస్తూ ఒక్కో పాయింట్‌తో ముందుకొచ్చారు. ఈ క్రమంలో 14–13తో ముందంజ వేశారు. కానీ గేమ్ చేజారుతుందనుకున్న టైమ్‌లో సాత్విక్ బేస్‌లైన్ షాట్స్‌తో చెలరేగాడు. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గిన ఇండియన్స్ 17–14తో ఆధిక్యంలోకి వచ్చారు. ఇక్కడి నుంచి చైనీస్ తైపీ జోడీ కాస్త పోరాడినా, సాత్విక్–చిరాగ్ వరుస పాయింట్లతో విజయాన్ని అందుకున్నారు.
