మైక్రోసాఫ్ట్ సీఈఓకి బంపర్ ఆఫర్: సత్య నాదెళ్ల మామూలోడు కాదు.. 2025లో రూ. 847 కోట్లు ఎలా వచ్చాయంటే..?

 మైక్రోసాఫ్ట్ సీఈఓకి బంపర్ ఆఫర్: సత్య నాదెళ్ల మామూలోడు కాదు.. 2025లో రూ. 847 కోట్లు ఎలా వచ్చాయంటే..?

అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల  కృత్రిమ మేధస్సు (Artificial intelligence)లో అద్భుతంగా పని చేయడంతో ఆయన జీతం భారీగా పెరగనుంది. సమాచారం ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి సత్య నాదెళ్ల మొత్తం సంపాదన 22 శాతం పెరిగి $96.5 మిలియన్లు అంటే సుమారు రూ. 847.31 కోట్లు అయింది. గత ఏడాది  చూస్తే $79.1 మిలియన్లు అంటే రూ.693 కోట్లు. మైక్రోసాఫ్ట్ షేర్ల ధర బాగా పెరగడమే ఈ పెంపుకు కారణం.

సత్య నాదెళ్ల జీతంలో ఎక్కువ భాగం $84 మిలియన్ల కంటే పైగా షేర్ల రూపంలో ఉంటుంది. దీని బట్టి చూస్తే కంపెనీ మార్కెట్‌లో ఎంత విజయవంతమైతే, ఆయన సంపద కూడా అంత పెరుగుతుందని తెలుసుతుంది.  క్యాష్ బోనస్  $9.5 మిలియన్ల కంటే పైగా లభించగా...  బేసిక్ శాలరీ  చాలా తక్కువ.

పెరుగుదలకు కారణం: మైక్రోసాఫ్ట్ షేర్స్  ధర ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 శాతం పెరిగింది. S&P 500 ఇండెక్స్ లో పెరుగుదల 15 శాతం మాత్రమే ఉంది. గత మూడేళ్లలో మైక్రోసాఫ్ట్ షేర్లు రెండింతల కంటే ఎక్కువ పెరిగాయి. దీనికి ప్రధాన కారణం AI. ముఖ్యంగా OpenAI తో కలిసి పని చేయడం ఇంకా క్లౌడ్ సేవలు (Azure) బాగా పెరగడం వల్ల మైక్రోసాఫ్ట్ షేర్ల ధర పెరిగింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ప్రతి సర్వీసులో AI ని వాడుతోంది. కంపెనీ ఆదాయం కూడా వేగంగా పెరుగుతుండటంతో  సత్య నాదెళ్లకు ఇంత పెద్ద మొత్తం లభిస్తుంది. 

గతంలో జీతం: 2024లో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరగ్గా, అప్పుడు ఆయన $79.1 మిలియన్లు అంటే రూ.693 కోట్లు  అందుకున్నారు. అంతకుముందు ఏడాది ఆయనకు $48.5 మిలియన్లు లభించింది. గత ఏడాది, కంపెనీపై సైబర్ దాడులు జరిగినప్పుడు, ఆయన క్యాష్ బోనస్‌ సగానికి తగ్గించాలని బోర్డును కోరారు. ఇది కార్పొరేట్ ప్రపంచంలో చాలా అరుదైన మంచి పనిగా పేరు తెచ్చింది. షేర్ ధరలు, లాభాలు పెరుగుతున్న  కూడా మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల తొలగింపులను చేసింది. 2025లో 15 వేల మందికి పైగా ఉద్యోగులను తీసివేయడంతో విచారం వ్యక్తం చేస్తూ ఒక మెమో పంపారు.  

సత్య నాదెళ్ల గత 10 ఏళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ దిగ్గజం నుండి AI లో శక్తిమంతమైన కంపెనీగా మారింది. 2014లో ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు కంపెనీ విలువ $400 బిలియన్ల కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు $3 ట్రిలియన్లకు పైగా పెరిగి, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.