ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: సౌర విద్యుత్ పథకాలతో రైతులు ఆర్థికంగా ఎదగాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద సూచించారు. గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖిలా వరంగల్ తూర్పు కోటలో రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ క్షేత్రాలు, -సౌర విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కుసుమ, పీఎం సూర్యఘర్ పథకాల ద్వారా రైతులు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుకొని ఆర్థికంగా లాభపడవచ్చని తెలిపారు.
వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి రైతులు అదనపు ఆదాయం పొందాలని చెప్పారు. అనంతరం విద్యుత్ భద్రత అవగాహన పోస్టర్లను కలెక్టర్ రిలీజ్ చేశారు. డీఏవో కె. అనురాధ, ఏవో జి.విజ్ఞాన్, శ్రావణ్, హరి, వరంగల్ సీనియర్ సైంటిస్టులు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం, అడిషనల్ కలెక్టర్ జి. సంధ్యారాణి, జీఎం రాజేందర్, డీఏవో అనురాధ, డీఈ మల్లికార్జున్ పాల్గొన్నారు.
