లింగంపేట, వెలుగు : మండలంలోని లింగంపల్లి ఖుర్దు, లింగంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సోమవారం ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి పరిశీలించారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులతో మాట్లాడారు. మీ గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ? మీరు ఏ పదవికి పోటీ చేస్తున్నారు.. అంటూ ఆరా తీశారు.
మండలంలో ఎన్ని గ్రామపంచాయతీలు ఉన్నాయని ఎంపీడీవో నరేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద కుర్చీలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకు సూచించారు. అనంతరం లింగంపేట రైతువేదిక భవనంలో ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులను పరిశీలించారు. ఆయన వెంట డీపీవో మురళి, తహసీల్దార్ సురేశ్, ఎంపీవో మలహరి తదితరులు పాల్గొన్నారు.
