
హైదరాబాద్, వెలుగు: అంగన్‌వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రిటైర్మెంట్ సమయంలో టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీల టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున అందజేస్తామన్నారు. రిటైర్ అయ్యాక ఆసరా పింఛన్ ఇస్తామన్నారు. టీచర్ల ఉద్యోగ విరమణ వయసు 65 ఏండ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ సెంటర్లను, ప్రధాన అంగన్‌వాడీ సెంటర్లకు అప్‌గ్రేడ్ చేస్తూ సీఎం కేసీఆర్ శుక్రవారం జీవో జారీ చేశారని మంత్రి చెప్పారు. అంగన్‌వాడీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం కేసీఆరేనని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90%, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10% ఉండేదని, మోదీ సర్కార్ ఈ వాటాను 60 శాతానికి తగ్గించిందన్నారు.
గురుకుల కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజ్..
ఎస్సీ గురుకుల పాఠశాలల్లోని 567 మంది కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నిర్ణయంపై రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది.