37 మందికి మరణశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా

37 మందికి మరణశిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా

ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారిని సౌదీ అరేబియా ఎన్నటికీ ఉపేక్షించదు. ఉగ్రవాదానికి పాల్పడే వారి విషయంలో ఆ దేశం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా వారి దేశానికే చెందిన 37 మందికి మరణ శిక్ష అమలు చేసి ఆ విషయాన్ని రుజువు చేసింది అక్కడి ప్రభుత్వం. వారంతా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారనే అభియోగంపై ఈ శిక్ష విధించినట్టు తెలిపింది. ఆ దేశ నియమాల ప్రకారం బహిరంగ నిరసనలు తెలపడం కూడా ఉగ్రవాదంగానే భావిస్తారట.

గడిచిన మూడు నెలల కాలంలో సౌదీ అరేబియా మొత్తం 43 మందికి మరణశిక్ష విధించిందని సమాచారం.  అక్కడి మరణ శిక్షలను ఉరి పద్ధతిలో కాకుండా బహిరంగంగానే తల నరికి శిక్షలను అమలు చేస్తారు. ఈ శిక్షలను సౌదీ రాజధాని రియాద్‌లోని డీరా స్క్వేర్‌లో అమలు చేస్తారు. ఈ ప్రాంతాన్ని చాప్ చాప్ స్క్వేర్ అని పిలుస్తారు. అయితే తాజాగా మరణశిక్షలను రియాద్‌తోపాటు, మక్కా, మదీనా, సెంట్రల్ ఖాసీం ప్రావిన్స్, ఈస్ట్రన్ ప్రావిన్స్‌ ప్రాంతాల్లో కూడా అమలు చేసినట్టు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. వారి నియమనిబంధనల ప్రకారం శుక్రవారం రోజున నమాజ్ అనంతరం నిందితులను బహిరంగంగా తల నరికి చంపుతారు