
ఆత్మకూరు(దామెర), వెలుగు : డిపార్ట్ మెంట్ లో ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి విద్యుత్ ను ఆదా చేయాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు సూచించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేటలో 1993 విద్యుత్ ఉద్యోగుల బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ ను పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్ తరాలకు అందించగలమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత విద్యుత్ రంగంలో చాలా సంస్కరణలు వచ్చాయని, వాటన్నింటినీ ఉద్యోగులు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం విద్యుత్తు అందించేలా కృషి చేయాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. ఎన్నో ఆటంకాలు, సవాళ్లు ఎదుర్కొంటూ సేవలు అందిస్తున్న ఉద్యోగులను ఆయన అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను, విద్యుత్ సబ్సిడీలను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకునేలా చూసే బాధ్యత ఉద్యోగులపైనే ఉందన్నారు. ఈ సమ్మేళనంలో ఎన్ పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, ఉద్యోగులు పాల్గొన్నారు.