మా నాన్న నుంచి కాపాడండి

మా నాన్న నుంచి కాపాడండి

తమ పేరు మీద డిపాజిట్ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు కన్న తండ్రి మమ్మల్ని చంపాలని చూస్తున్నాడని..ఇద్దరు చిన్నారులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. గురువారం ఆ ఇద్దరు చిన్నారులు, వారి పెద్దమ్మ నారాయణగూడలోని బాలల హక్కుల సంఘం ఆఫీసులో గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావుని కలిసి ఈ విషయాన్ని చెప్పారు. వివరాల్లోకి వెళితే..గాంధీనగర్ లో ఉండే ఫకీరా అలియాస్ రాజ్ కుమార్ భార్య విజయలక్ష్మి, పిల్లలు మయూర్ కుమార్(11), బేబి లక్ష్య(9)తో కలిసి ఉండేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక విజయలక్ష్మి గతేడాది డిసెంబర్ లో ఆత్మహత్య చేసుకుంది. విజయలక్ష్మి చనిపోకముందు తన దగ్గరున్న బంగారాన్ని పిల్లల పేరున బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. ఆ బంగారాన్ని దక్కించుకునేందుకు రాజ్ కుమార్ పిల్లలకు హింసించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారులను చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో పిల్లలు మయూర్ కుమార్, లక్ష్య ఇద్దరూ కలిసి.. తండ్రి దగ్గరి నుంచి తమకు ప్రాణరక్షణ కల్పించాలని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమను పెద్దమ్మ దగ్గరికి చేర్చాలని ఆ చిన్నారులు కోరారు. ఈ విషయాన్ని సిటీ అడిషనల్ సీపీ షిఖాగోయల్ దృష్టికి తీసుకెళ్లినట్లు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు చెప్పారు. చిన్నారులు మయూర్ కుమార్, లక్ష్యకు తగిన రక్షణ కల్పించి ఆదుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ ను అడిషనల్  సీపీ  షిఖాగోయల్ ఆదేశించారని అచ్యుతరావు తెలిపారు.  బంగారు ఆభరణాల కోసం కన్న పిల్లలకు చంపేందుకు ప్రయత్నించిన రాజ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.