అచ్చం ‘ది గోట్ లైఫ్’ సినిమాలోలానే జరిగింది.. సౌదీలో దీన స్థితిలో నిర్మల జిల్లా ఒంటెల కాపరి

అచ్చం ‘ది గోట్ లైఫ్’ సినిమాలోలానే జరిగింది.. సౌదీలో దీన స్థితిలో నిర్మల జిల్లా ఒంటెల కాపరి
  • నా భర్తను కాపాడండి
  • ఇమిగ్రేషన్​ ఆఫీసర్‌‌‌‌కు గల్ఫ్​ బాధితుడి భార్య విజ్ఞప్తి 
  • సౌదీలో ఒంటెల కాపరిగా పనిచేస్తున్న నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నామ్ దేవ్
  • డొమెస్టిక్ హెల్పర్ వీసాపై కువైట్ కు తీసుకెళ్లి అక్రమంగా సౌదీకి పంపారని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: అరేబియన్ ఎడారిలో సరైన వసతి, ఆహారం లేక అనారోగ్యం పాలవుతున్న తన భర్తను కాపాడాలని నిర్మల్ ​జిల్లాకు చెందిన గిరిజన మహిళ రాథోడ్​లక్ష్మి పాస్​పోర్ట్ ​అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన భర్తను డొమెస్టిక్ హెల్పర్ వీసాపై కువైట్​కు తీసుకెళ్లి,, అక్రమంగా సౌదీ అరేబియాకు తరలించారని, అక్కడి ఎడారిలో బలవంతంగా ఒంటెల కాపరిగా పనిచేయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ మేరకు సోమవారం మినరల్​డెవలప్​మెంట్ కార్పొరేషన్​ చైర్మన్​ఈరవత్రి అనిల్​కుమార్​తో కలసి సికింద్రాబాద్​లోని పాస్​పోర్ట్​ కార్యాలయంలో ప్రొటెక్టర్​ఆఫ్​ఇమిగ్రేషన్ అధికారి అమిత్​కుమార్ కు​వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నామ్​దేవ్ అనే గిరిజనుడు ఢిల్లీ లోని సనా ఫెసిలిటేషన్ సెంటర్ అనే లైసెన్స్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా అక్టోబర్ 2023 లో డొమెస్టిక్ హెల్పర్ (ఇంటి పని) వీసాపై కువైట్ కు వెళ్లాడు. 

తీరా అక్కడికి వెళ్లాక ఇంటి పని ఇవ్వకుండా కువైట్​నుంచి అక్రమంగా సౌదీ అరేబియా బార్డర్​కు తరలించారు. అక్కడ ఎడారిలో ఒంటెల కాపరిగా నియమించారని నాందేవ్​భార్య​లక్ష్మి తెలిపింది. అక్కడ అతనికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, తాను పడుతున్న ఇబ్బందులను చెప్పి వాపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా అరేబియన్ ఎడారిలో సరైన వసతి, ఆహారం లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని తనను రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాథోడ్ నామ్​దేవ్ పంపిన వీడియో సోషల్​ మీడియాలో సంచలనం రేపింది. 

ఈ విషయం పై ఏజెంట్​కు ఫోన్​చేసినా సరైన సమాధానం ఇవ్వడం లేదని, పైగా ఫోన్​ స్విచాఫ్​ చేసిపెట్టుకున్నాడని లక్ష్మి తెలిపింది. అంతేకాకుండా, సౌదీలో తన భర్తను అక్కడి ఒంటెల యజమాని తీవ్రంగా హింసిస్తున్నట్టు తెలిపారని ఆమె పేర్కొంది. తాము నిరుపేదలమని, తాను వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నానని ఆమె వెల్లడించింది. ఎడారిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తన భర్తను రక్షించి ఇండియాకు తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. 

ఇది కచ్చితంగా మానవ అక్రమ రవాణే: ఈరవత్రి అనిల్
హౌస్​కీపింగ్​పని ఇప్పిస్తానని చెప్పి కువైట్​కు తీసుకుపోయి.. అక్కడి నుంచి అక్రమంగా సౌదీ అరేబియాకు తరలించడం మానవ అక్రమ రవాణే అవుతుందని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన విధంగా స్పందించి రాథోడ్​నామ్​దేవ్​కు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. నామ్​దేవ్​ను సొంత ఊరికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.