ఓటీటీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సేవ్ ద టైగర్స్’ ఇప్పుడు మూడో సీజన్‌తో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు భారీ విజయాలు సాధించడంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. జూన్ 19 నుంచి ఈ మూడో సీజన్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఎవరన్నా.. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి మనకు ఇన్ని అబద్ధాలు చెప్పింది.. పెళ్లి అంటే పండు వెన్నెల, పెళ్లాం అంటే నిండు పున్నమి’ అని రాహుల్ పాత్రలో అభినవ్ గోమటం చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ కంప్లీట్ ఫన్నీగా సాగింది.
బార్‌లో రాహుల్ (అభినవ్ గోమటం), విక్రమ్ (కృష్ణ చైతన్య), ఘంటా రవి (ప్రియదర్శి) ముగ్గురూ కలిసి పెళ్లి గురించి, జీవితం గురించి మాట్లాడుకోవడం సరదాగా ఉంటుంది. ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నాడు ఒకడు.. నాకు దొరికితేనా?’ అని విక్రమ్ (కృష్ణ చైతన్య) అనడంతో స్వర్గంలో ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ ప్రత్యక్షం అవుతాడు.
అక్కడి నుంచి కథ వేరే ట్రాక్ ఎక్కుతుంది. దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, రోహిణి ఇలా అందరూ తమ తమ పాత్రలతో మరోసారి ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ సిరీస్‌కు మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా వ్యవహరిస్తుండగా, శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహిస్తున్నాడు. శివ మేక, సాహితి చింతలపూడి నిర్మిస్తున్నారు.
