ఆరు గ్యారంటీలు ఎప్పుడు పూర్తి చేస్తరో చెప్పాలి: మధుసూదనాచారి

ఆరు గ్యారంటీలు ఎప్పుడు పూర్తి చేస్తరో చెప్పాలి: మధుసూదనాచారి
  • కాంగ్రెస్ అభివృద్ధి మాటల్లోనే
  • బీఆర్ఎస్​ సర్కారు పదేండ్లలో చేయలేనిది ఏడు నెలల్లో చేశామన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • శాసనమండలిలో బడ్జెట్​పై వాడివేడి చర్చ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ చేసే అభివృద్ధి మాటల్లోనేనని.. చేతల్లో లేదని ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. ఆరు గ్యారంటీలు ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్​చేశారు. శాసనమండలిలో శనివారం బడ్జెట్​పై వాడివేడి చర్చ జరిగింది. సాధారణ చర్చలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ మధుసూదనాచారి, కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ ఏవీఎన్​ రెడ్డి మాట్లాడారు. 

ఈ చర్చలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. మొదటి కేబినెట్ సమావేశం జరిగి నాలుగు నెలలవుతున్నా.. ఇంత వరకు ఆరు గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. బడ్జెట్ ప్రసంగమంతా బీఆర్ఎస్, కేసీఆర్ ను నిందించేలా మాత్రమే ఉందని ఫైర్ ​అయ్యారు. 

గత  పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే.. అసలు అభివృద్ధే చేయలేదన్నట్టుగా విమర్శించడం కాంగ్రెస్​కు తగదన్నారు. తమ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందని విమర్శించారు. 

బీఆర్ఎస్ తప్పులను తమపై వేసేందుకు కుట్ర: జీవన్ రెడ్డి

గత పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తమ కాంగ్రెస్​ప్రభుత్వంపై వేసేందుకు కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులను కూడా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందని విమర్శించారు. సాగుకు పనికిరాని భూములు, కొండలు, గుట్టలు, వెంచర్లకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా రైతుబంధు నిధులిచ్చిందని మండిపడ్డారు. 

 కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాను రూ.36 వేల కోట్లతో రూపొందించి ఆ తర్వాత దాదాపు లక్ష కోట్లకు పెంచారన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన విషయం ప్రపంచానికి తెలుసన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ఐదేండ్లలో చేయలేనివి కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలల్లో చేసిందన్నారు. ఒక్కొక్క హామీని అమలు చేస్తూ తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.  

విద్యకు ప్రాధాన్యం ఇవ్వలే: ఏవీన్ రెడ్డి

బీఆర్ఎస్ చేసిన తప్పులనే కాంగ్రెస్ కూడా చేస్తోందని, బడ్జెట్​లో విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదని  బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలుగా అమలుకాని హామీలను ఇచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తామని చెప్పి, ఇప్పుడేమో అందులో కోత విధిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.900 కోట్లతో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు.

 యూనివర్సిటీలు నాశనమయ్యాయని, రెగ్యులర్ ఫ్యాకల్టీ సంఖ్య తగ్గిపోయిందని మండిపడ్డారు.  విద్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం 6.57 శాతం నిధులు కేటాయిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ 7.3 నిధులనే కేటాయించిందని.. ఇవి ఏమాత్రం సరిపోవని ఆయన అన్నారు. కాగా బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధి, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణకు నిధుల కేటాయింపులను ఆయన స్వాగతించారు.