
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), వచ్చే ఐదేళ్లలో తమ మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల వాటాను 30 శాతానికి పెంచుతామని ప్రకటించింది. ‘‘ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల్లో మహిళల వాటా 33శాతంగా ఉన్నప్పటికీ, మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా 27శాతం మాత్రమే. ఈ గ్యాప్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంస్థలో మొత్తం 2.4 లక్షలకుపైగా ఉద్యోగులు ఉన్నారు.
మహిళలకు లీడర్‌షిప్, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, గౌరవం కలిగిన వాతావరణాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం”అని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్(హెచ్‌ఆర్) కిషోర్ కుమార్ పోలుదాసు అన్నారు. చైల్డ్‌కేర్ అలవెన్స్, ఫ్యామిలీ కనెక్ట్ ప్రోగ్రాం, మెటర్నిటీ తర్వాత తిరిగివచ్చే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయని తెలిపారు. ‘ఎంపవర్ హెర్’ అనే ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం కింద లీడర్‌షిప్ ల్యాబ్స్, కోచింగ్ సెషన్లు ద్వారా మహిళల నాయకత్వాన్ని పెంపొందిస్తామని అన్నారు.
బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్, గర్భిణీ సిబ్బందికి పోషకాహార అలవెన్స్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ వంటి ఆరోగ్య కార్యక్రమాలను కూడా ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు 340కి పైగా మహిళా సిబ్బందితో నడిచే బ్రాంచీలు ఉన్నాయి.