ఎస్బీఐ సేవా కార్యక్రమాలు అభినందనీయం : ఎంపీ మల్లు రవి

ఎస్బీఐ సేవా కార్యక్రమాలు అభినందనీయం : ఎంపీ మల్లు రవి

అలంపూర్/మానవపాడు, వెలుగు: ఎస్బీఐ గ్రామాలను దత్తత తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి తెలిపారు. మంగళవారం ఎస్బీఐ చైర్మన్  శ్రీనివాసులు శెట్టి సొంత గ్రామమైన మానవపాడు మండలం పెద్దపోతులపాడులో కార్పొరేట్  సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఎస్బీఐ ఫౌండేషన్, భవిష్య భారత్  స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్  సంతోష్ తో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎస్బీఐ చైర్మన్  తన సొంత ఊరితో పాటు పక్కనే ఉన్న గ్రామాల్లో ఫౌండేషన్  ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్బీఐ చైర్మన్ గా ఈ గ్రామస్తుడు ఉండడం గర్వకారణమన్నారు. కలెక్టర్  సంతోష్  మాట్లాడుతూ పెద్దపోతులపాడు, చిన్న పోతులపాడు, చెన్నిపాడు, బొంకూరు, గోకులపాడు గ్రామాల్లో రూ.4 కోట్లతో విద్య, వైద్య, ఇతర రంగాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు. 

ఎస్బీఐ తెలంగాణ సీజీఎం రాధాకృష్ణన్ మాట్లాడుతూ మరిన్ని ప్రాంతాల్లో ఎస్బీఐ ఫౌండేషన్  ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అనంతరం ఎస్బీఐ చైర్మన్  సందేశాన్ని ఎల్ఈడీపై వీక్షించారు. పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, లైబ్రరీ చైర్మన్  నీలి శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్  దొడ్డప్ప, హరిప్రసాద్, స్వపన్ ధర్, జగన్నాథ్ సాహో, సునీత తనం, హేమంత్ కుమార్, సిద్ధ లింగేశ్​ పాల్గొన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యం 

శాంతినగర్/అయిజ: అలంపూర్  నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధే లక్ష్యమని ఎంపీ మల్లు రవి తెలిపారు. వడ్డేపల్లి,అయిజ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో కలిసి వడ్డేపల్లి మున్సిపాలిటీలోని పైపాడులో రూ. 4 కోట్ల అభివృద్ధి పనులకు, అయిజ మున్సిపాలిటీలో రూ.3.95 కోట్ల పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని చెప్పారు. 

పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో పేదలు రేషన్  కార్డులు లేక ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఇదిలాఉంటే అభివృద్ధి పనులకు భూమిపూజ చేసే సందర్భంలో పైపాడు గ్రామంలో ప్రొటోకాల్  విషయంలో ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్  వర్గీయులు, అలంపూర్  మార్కెట్  చైర్మన్  దొడ్డప్ప మధ్య వాగ్వాదం జరిగింది. కొబ్బరికాయలు తామంటే తాము కొడతామని ఒకరినొకరు తోసుకున్నారు. 

ఇదిలాఉంటే పైపాడులో జరిగిన ఘటన నేపథ్యంలో అయిజ పోలీసులు బీఆర్ఎస్  నాయకులు కురువ పల్లయ్య, యోబు, అంజి, వీరేశ్, లెనిన్  తదితరులను ముందస్తుగా అరెస్ట్​ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులతో మాట్లాడారు. ప్రొటోకాల్  ప్రకారం తనకు కొబ్బరికాయ కొట్టే అవకాశం ఇవ్వకుండా, ఎలక్షన్​లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు ఎంపీ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.