చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ గోల్డ్ స్కామ్ బాధితులు సోమవారం ఉదయం బ్యాంకులో ఆందోళనకు దిగారు. బ్యాంకులో స్కామ్ జరిగి 9 నెలలు అవుతున్నా.. తమ నగలు ఇవ్వటం లేదని నిజామాబాద్ నుంచి వచ్చిన డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహును నిలదీశారు. వాయిదాలు పెడుతూ దాటవేస్తున్నారని, మా బంగారాన్ని కోర్టు నుంచి విడిపించి మాకు ఎప్పుడు ఇస్తారని డీజీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో 15 రోజుల్లో కోర్టు నుంచి విడిపించి ఇస్తామని, ఆందోళన చెందవద్దని డీజీఎం సర్దిచెప్పారు. కోర్టులో కేసు విచారణ చివరి దశలో ఉందని, త్వరలోనే సమస్యను పరిష్క రిస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

