ఫోన్‌‌పే, గూగుల్‌‌ పే, పేటీఎంకు పోటీగా యోనో యూపీఐ పేమెంట్స్‌‌

ఫోన్‌‌పే, గూగుల్‌‌ పే, పేటీఎంకు పోటీగా యోనో యూపీఐ పేమెంట్స్‌‌
  • ఫోన్‌‌పే, గూగుల్‌‌ పే, పేటీఎంకు పోటీగా యోనో యూపీఐ పేమెంట్స్‌‌
  • ఇతర బ్యాంక్ కస్టమర్లు కూడా ట్రాన్సాక్షన్లు చేసుకునేందుకు వీలు
  • రిజిస్ట్రేషన్ ప్రాసెస్  ఈజీ
  • పెద్ద బ్యాంక్ కావడంతో కాంపిటీషన్ పెరుగుతుందని అంచనా

న్యూఢిల్లీ : డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్‌‌లను దేశంలోని ప్రతీ ఒక్కరికి అందించేందుకు ఎస్‌‌బీఐ కొత్త ఫీచర్‌‌‌‌ను తీసుకొచ్చింది. తన యోనో యాప్‌‌ ద్వారా ఇతర బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు కూడా ట్రాన్సాక్షన్లు చేసుకునే వీలు కలిపిస్తోంది. ‘ ‘ప్రతీ భారతీయుడికి యోనో’ తో ఏ బ్యాంక్ కస్టమర్‌‌‌‌ అయినా స్కాన్‌‌ అండ్ పే, కాంటాక్ట్స్‌‌కు పే చేయడం, మనీని రిక్వెస్ట్ చేయడం వంటి యూపీఐ ఫీచర్లను వాడుకోవచ్చు’ అని ఎస్‌‌బీఐ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. 

ఇతర బ్యాంక్ కస్టమర్లు  ఎస్‌‌బీఐ యోనో యూపీఐని ఇలా వాడుకోవచ్చు

* ఎస్‌‌బీఐ యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌‌  గూగుల్‌‌ ప్లే  స్టోర్‌‌‌‌, ఐఫోన్‌‌ యాప్‌‌ స్టోర్లలో అందుబాటులో ఉంది. యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ.

* యాప్‌‌ను డౌన్‌‌లోడ్ చేసుకున్నాక  ‘ఎస్‌‌బీఐకి కొత్త’  అనే ఆప్షన్‌‌ ఉంటుంది. దీని కింద ‘రిజిస్టర్‌‌‌‌ చేసుకోండి’ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఇతర బ్యాంక్ కస్టమర్లు  ఈ ఆప్షన్ క్లిక్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.

* ‘యూపీఐ పేమెంట్స్ కోసం రిజిస్ట్రేషన్‌‌’ అనే ఆప్షన్ తర్వాతి పేజ్‌‌లో కనిపిస్తుంది.  ఈ ఫీచర్‌‌ వాడాలంటే  మీ ఫోన్ నెంబర్‌‌‌‌ బ్యాంక్ అకౌంట్‌‌ నెంబర్‌‌‌‌తో లింకై ఉండాలి. ఈ నెంబర్‌‌‌‌ గల సిమ్‌‌ను సెలెక్ట్‌‌ చేసుకోవాలి.  ఫోన్‌‌ నెంబర్‌‌‌‌ను వెరిఫై చేయడానికి ఓ ఎస్ఎంఎస్‌‌ వస్తుంది. ఈ మెసేజ్‌‌కు స్టాండర్డ్ ఛార్జీలు పడతాయి. 

* ఫోన్ నెంబర్ వెరిఫై అయ్యాక, మీ బ్యాంక్‌‌ను సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్‌‌ పేరు టైప్ చేయడం ద్వారా లేదా కింద ఉన్న ఆప్షన్స్‌‌లో ఒక బ్యాంక్‌‌ను ఎంచుకోవడం ద్వారా యూపీఐ ఐడీని క్రియేట్‌‌ చేసుకోవచ్చు.  ఎస్‌‌బీఐ పే కోసం రిజిస్టర్ చేసుకోవడం మొదలైందని, ఒకవేళ మీరు చేయకపోతే వెంటనే సంబంధిత బ్యాంక్‌‌ను సంప్రదించాలనే మెసేజ్ వస్తుంది. 

* మీ అకౌంట్ నెంబర్ స్క్రీన్‌‌పైన కనిపిస్తుంది. మూడింటిలో  ఒక యూపీఐ ఐడీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ‘సక్సెస్‌‌ఫుల్‌‌గా యూపీఐ ఐడీ క్రియేట్ అయ్యింది’ అనే మెసేజ్ వస్తుంది. లాగిన్ అవ్వడానికి  యూజర్లు ఎంపిన్‌‌ను క్రియేట్  చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క సారి ఆరు అంకెల ఎంఫిన్‌‌ క్రియేట్ చేసుకుంటే మీ యోనో  యూపీఐ అకౌంట్ రెడీ అయినట్టే. 

పేమెంట్ కంపెనీలకు కష్టమే!

ఇతర బ్యాంక్ కస్టమర్లు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం ద్వారా ఎస్‌‌బీఐ డైరెక్ట్‌‌గా ఫోన్‌‌పే, పేటీఎం,  గూగుల్‌‌ పేతో పోటీ పడనుంది. టెక్‌‌ బ్రాండ్ల కంటే బ్యాంక్ బ్రాండ్లను నమ్మేవారు ఎక్కువ మంది ఉన్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. యూపీఐ పేమెంట్స్‌‌లో ఇదో పెద్ద రివల్యూషన్‌‌గా మారుతుందని అన్నారు.  మారుమూల ప్రాంతాల్లో కూడా యూపీఐ వాడకం పెరగడానికి ఇది సాయపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘యోనో యాప్‌‌ ద్వారా సుమారు 78 లక్షల మంది కస్టమర్లను (సేవింగ్స్‌‌) ఎస్‌‌బీఐ పొందింది. తాజా నిర్ణయంతో  టెక్నాలజీని వాడే యువతను ఆకర్షించాలని చూస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌‌బీఐ కొత్త తరం పేమెంట్ యాప్స్‌‌ సెగ్మెంట్లలోకి ఎంట్రీ ఇవ్వడం వీటికి నష్టం కలిగిస్తుంది’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు. మరికొంత మంది ఎనలిస్టులు మాత్రం  పాపులర్ యూపీఐ యాప్‌‌లకు ఎటువంటి ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. ఈ యాప్‌‌లు జనాల్లోకి బాగా వెళ్లిపోయాయని,  కేవలం యూపీఐ సర్వీస్‌‌లు మాత్రమే కాకుండా ఇతర సర్వీస్‌‌లను కూడా అందిస్తున్నాయని చెప్పారు. ఎస్‌‌బీఐ వలన డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ సెగ్మెంట్‌‌లో కాంపిటీషన్ పెరుగుతుందని, ఇన్నోవేషన్స్‌‌కు దారితీస్తుందని అన్నారు. ఇతర బ్యాంక్‌‌లు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఎస్‌‌బీఐ బాటలోనే యూపీఐ పేమెంట్‌‌ సర్వీస్‌‌లను అందరికీ అందుబాటులోకి తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు.

యూపీఐతో ఎస్‌‌బీఐ ఏటీఎంల నుంచి విత్‌‌డ్రా..

ఇంటరాపరబుల్‌‌ కార్డ్‌‌లెస్‌‌ క్యాష్​ విత్‌‌డ్రా (ఐసీసీడబ్ల్యూ) ఫెసిలిటీని కూడా ఎస్‌‌బీఐ అందుబాటులోకి తెచ్చింది.  యూపీఐ క్యూఆర్‌‌‌‌ క్యాష్‌‌ను వాడుకొని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ కస్టమర్లు ఎవరైనా ఎస్‌‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌‌డ్రా చేసుకోవచ్చు. కానీ, ఐసీసీడబ్ల్యూ ఫెసిలిటీ అందుబాటులో ఉన్న ఏటీఎంలలోనే ఇలా విత్‌‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. ఏటీఎంలలో క్యూఆర్ కోడ్ డిస్‌‌ప్లే అవుతుంది. యూజర్లు తమ యూపీఐ యాప్‌‌లోని ‘స్కాన్ అండ్ పే’ ఫీచర్‌‌‌‌ను వాడి క్యాష్‌‌ను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.