ఎస్‌‌బీఐతో ఐఐబీఎక్స్‌‌ నుంచి.. సులభంగా గోల్డ్ దిగుమతులు

ఎస్‌‌బీఐతో ఐఐబీఎక్స్‌‌ నుంచి.. సులభంగా గోల్డ్ దిగుమతులు

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ), ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ (ఐఐబీఎక్స్‌‌)లో స్పెషల్ కేటగిరీ క్లయింట్ (ఎస్‌‌సీసీ)గా తన తొలి బంగారం లావాదేవీని విజయవంతంగా పూర్తి చేసింది.  భారత బులియన్ దిగుమతుల్లో కొత్త శకం మొదలైందని  పేర్కొంది. ఎస్‌‌బీఐ ఐఐబీఎక్స్​లో 2024లో  ట్రేడింగ్- కమ్ -క్లియరింగ్ మెంబర్‌‌గా చేరింది. ఇప్పుడు ఎస్‌‌సీసీగా మారింది. 

ఐఐబీఎక్స్ ద్వారా  బంగారం దిగుమతి చేసుకోవాలనుకునే   ఎంఎస్‌‌ఎంఈ జ్యువెలర్స్, బులియన్ డీలర్లు, ఇతర వ్యాపారులు   ఎస్‌‌బీఐ ద్వారా   మరింత  వేగంగా, సులభంగా, పారదర్శకంగా గోల్డ్‌‌ను దిగుమతి చేసుకోవచ్చు. 

 ‘‘ఈ భాగస్వామ్యంతో ఆర్థిక సేవలు అందించే సంస్థలలో ఎస్‌‌బీఐ ముందుంటుంది. ఇది దేశవ్యాప్తంగా బులియన్, జ్యువెలరీ రంగానికి ప్రయోజనం చేకూరుస్తుంది”అని ఎస్‌‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. 

గిఫ్ట్‌‌ సిటీని గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్‌‌గా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఎస్‌‌బీఐ మద్దతు ఇస్తోందని చెప్పారు. ఇతర నామినేటెడ్ బ్యాంకులు కూడా ఎస్‌‌సీసీగా ఐఐబీఎక్స్​లో చేరే అవకాశం ఉందని అన్నారు.