హైదరాబాద్: హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐదెకరాల భూమి వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పాన్మక్త పరిధిలోని సర్వే నంబర్ 83/1లో గల ఈ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఈ-వేలం ద్వారా విక్రయించడాన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ 2 రిట్ పిటిషన్లు దాఖలు చేసింది. మే 6న ఇచ్చిన వేలం నోటిఫికేషన్‌తో పాటు మే 28న జరిగిన వేలం ప్రక్రియ, విక్రయాన్ని రద్దు చేయాలని బ్యాంకు కోరింది. పిటిషన్ వివరాల ప్రకారం.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2010లో రూ.13.33 కోట్లకు ఈ భూమిని ఎస్బీఐకి కేటాయించింది. 2011లో ఒప్పందం కుదిరి భూమి స్వాధీనం చేసుకున్నారు. ఎస్బీహెచ్ బ్యాంక్, ఎస్బీఐలో విలీనం కావడంతో ఆ హక్కులు ఎస్బీఐకి వచ్చాయి.
ఇక్కడ ‘అడ్వాన్స్‌డ్ కెపబిలిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్’ పేరిట ముంబయి తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించాలని బ్యాంకు ప్రణాళిక వేసింది. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగిందని, అయితే ప్రహరీ, మౌలిక వసతులు, ఏటీఎంల ఏర్పాటుకు ఇప్పటికే రూ.21.50 కోట్లకు పైగా ఖర్చు చేశామని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం భూమి తమ ఆధీనంలోనే ఉందన్నారు. గడువు పొడిగింపునకు టీజీఐఐసీ గతంలో సిఫారసు చేసినప్పటికీ, ప్రభుత్వం 2021లో కేటాయింపును రద్దు చేసింది. దీనిపై బ్యాంకు కోర్టుకు వెళ్లగా, నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని 2022లో హైకోర్టు ఆదేశించింది.
అనంతరం 2024లో ప్రభుత్వం మళ్లీ కేటాయింపు రద్దు చేయగా ఎస్‌బీఐ కోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో, బ్యాంకు వినతిని పరిశీలించాలని కోర్టు కేసు ముగించింది. ఈ నేపథ్యంలో 2026 మే 4న ఎస్బీఐ అధికారులతో విచారణ జరిపిన టీజీఐఐసీ, దానిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండానే మే 6న వేలం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మే 23న గడువు పొడిగింపు అభ్యర్థనను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలులో ఉండగా వేలం వేయడం చట్టవిరుద్ధమని ఎస్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఎస్. ప్రసాద్ వాదించారు. ఇటీవల వేలంలో ఎకరానికి రూ.170 కోట్లకు పైగా ధర పలికిందని, గౌరా వెంచర్స్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచిందని కోర్టుకు తెలిపారు. జస్టిస్ శ్రవణ్‌కుమార్ గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరపనున్నారు.
