ఎస్‌‌బీఐ లాభం రూ.18,643 కోట్లు.. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే 9.9 శాతం డౌన్‌‌

ఎస్‌‌బీఐ లాభం రూ.18,643 కోట్లు.. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే 9.9 శాతం డౌన్‌‌
  • వడ్డీ ఆదాయం రూ.42,774 కోట్లు 
  • షేరుకి రూ.15.90 డివిడెండ్‌‌..ఈ నెల 16 రికార్డ్ డేట్‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద బ్యాంక్‌‌ ఎస్‌‌బీఐకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌‌ (క్యూ4)‌‌లో  రూ.18,643 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో వచ్చిన  రూ. 20,698 కోట్లతో పోలిస్తే 9.9 శాతం తగ్గింది. స్టేట్‌‌ బ్యాంక్‌‌కు రూ. 17,093 కోట్ల నికర లాభం వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌‌ఐఐ) ఏడాది లెక్కన 1.5 శాతం పెరిగి రూ.41,655 కోట్ల నుంచి రూ.42,774 కోట్లకు చేరుకుంది.

ఇది ఎనలిస్టులు వేసిన అంచనా రూ. 42,465.7 కోట్ల కంటే కొంచెం ఎక్కువ. బ్యాంక్ మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను  షేరుకు రూ. 15.90  డివిడెండ్‌‌ ప్రకటించింది. ఇందుకోసం మే 16ను రికార్డ్ తేదీగా  నిర్ణయించింది. అంటే ఈ తేదీ నాటికి షేర్లు హోల్డ్‌‌ చేస్తున్న వారికి డివిడెండ్ చెల్లిస్తారు.  ఎస్‌‌బీఐ  మే 30న డివిడెండ్ చెల్లిస్తుంది. ఎస్‌‌బీఐ షేర్లు శుక్రవారం 1.44 శాతం పెరిగి రూ.800 వద్ద ముగిశాయి.  

తగ్గిన మొండి బాకీలు 
బ్యాంక్  ప్రొవిజన్‌‌లు క్యూ4లో  20.4 శాతం (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌)  పెరిగి రూ.3,964 కోట్లకు చేరాయి. గ్రాస్ ఎన్‌‌పీఏల (మొండిబాకీల) రేషియో కిందటేడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో 2.24 శాతం ఉండగా, తాజా క్యూ4లో 1.82 శాతానికి మెరుగుపడింది. నెట్‌‌ ఎన్‌‌పీఏల రేషియో 0.57 శాతం నుంచి  0.47 శాతానికి తగ్గింది. వాల్యూ పరంగా చూస్తే, గ్రాస్ ఎన్‌‌పీఏలు కిందటేడాది డిసెంబర్ 31 నాటికి రూ.84,360 కోట్లు ఉంటే, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో  రూ.76,880 కోట్లకు తగ్గాయి. ఇదే టైమ్‌‌లో నికర ఎన్‌‌పీఏలు రూ.21,378 కోట్ల నుంచి రూ.19,667 కోట్లకు  దిగొచ్చాయి. 

బ్యాంక్ ఇచ్చిన మొత్తం అప్పుల విలువ రూ.42,21 లక్షల కోట్లు
ఈ ఏడాది మార్చి31 నాటికి ఎస్‌‌బీఐ ఇచ్చిన మొత్తం అప్పులు (అడ్వాన్స్‌‌లు) రూ.42.21 లక్షల కోట్లకు చేరాయి. చిన్న పరిశ్రమలకు ఇచ్చిన అప్పులు గత ఏడాది కాలంలో 16.9 శాతం పెరగగా, హోమ్ లోన్లు  14.5 శాతం వృద్ధి చెందాయి. పర్సనల్ లోన్లు  11.4 శాతం ఎగసి రూ.15.06 లక్షల కోట్లకు పెరిగాయి.

డిపాజిట్లు 9.5 శాతం వృద్ధి చెంది  రూ.53.82 లక్షల కోట్లకు పెరిగాయి.  బ్యాంక్ కాసా నిష్పత్తి 39.97 శాతంగా ఉంది. ఎస్‌‌బీఐ  14.25 శాతం క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఏఆర్‌‌‌‌) ను మెయింటైన్ చేస్తోంది.  బ్యాంక్ తన డిజిటల్ ఫుట్‌‌ప్రింట్‌‌ను విస్తరిస్తోంది. కొత్తగా ఓపెన్ అయిన బ్యాంక్ అకౌంట్లలో  64 శాతం యోనో యాప్ ద్వారా జరిగాయి.