సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట

 సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణపై మధ్యంతర స్టే మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జూలై 14కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మే 23న కర్ణాటక  హైకోర్టులో విచారణ జరగనున్నట్లుగా డీకే శివకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు.  

మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్‌పై దర్యాప్తును ఆధారంగా చేసుకొని.. ఆదాయపు పన్ను శాఖ  కూడా 2017లో  ఆయన ఇంటిపై దాడులు చేసింది. అదే సమయంలో ఆయనపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ పలుమార్లు అనుమతి కోరింది. దీంతో 2020లో డీకేఎస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఇలా తనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోపాటు తనపై జరుగుతోన్న దర్యాప్తును సవాలు చేస్తూ డీకే శివకుమార్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీబీఐ తనపై పదేపదే నోటీసులు జారీ చేస్తూ, తనపై మానసిక ఒత్తిడిని ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. 

దీంతో ఆయనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన మధ్యంతర స్టే విధించింది. అనంతరం ఆ స్టేను పలుమార్లు పొడిగించింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది.