దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మార్పు

దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మార్పు
  • సర్కారుకు ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు
  • ఇప్పటి దాకా లబ్ధిదారుల ఎంపిక అధికారం ఎమ్మెల్యేలది
  • ఇష్టమున్నోళ్లకు.. పైసలిచ్చినోళ్లకే ఇస్తున్నరనే ఆరోపణలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : దళిత బంధు స్కీం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మార్పులు రానున్నాయి. ఇప్పటి దాకా లబ్ధిదారుల లిస్ట్‌‌‌‌ను ఎమ్మె్ల్యేలు ఫైనల్‌‌‌‌ చేస్తుండగా, దానికి ఫుల్‌‌‌‌స్టాఫ్‌‌‌‌ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎంపిక ప్రక్రియ అధికారం ఆఫీసర్లకు అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. వీటికి ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది ఎంపిక అధికారులే చేపట్టనున్నారు. మొదటి విడత దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇప్పటిదాక ఎంపిక చేసింది ఎమ్మెల్యేలే
కిందటేడు ప్రారంభమైన దళిత బంధు స్కీంను సర్కార్ పైలట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి, హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గం, నాలుగు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 100  మంది చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. వంద మంది లబ్ధిదారుల ఎంపిక అధికారం సర్కార్ ​ఎమ్మెల్యేలకు అప్పగించింది. లబ్ధిదారుల లిస్ట్‌‌‌‌ను వారే ఫైనల్‌‌‌‌ చేశారు. చివరగా ఇన్‌‌‌‌చార్జి మంత్రి అనుమతి తీసుకోవాలి. 

ఈ ఏడాది ఇంకెప్పుడు ప్రారంభిస్తరు?
ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 2 నెలలు దాటినా దళితబంధు స్కీంపై  ఇప్పటికీ ఎలాంటి కదలిక లేదు. ఈ సారి ఒక్కో నియోజకవర్గానికి 1500 మందికి చొప్పున ఇవ్వనున్నారు. ఇందుకు బడ్జెట్‌‌‌‌లో 17,700 కోట్లు కేటాయించగా, ఇటీవల బడ్జెట్ రిలీజ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఇచ్చారు. కానీ ఇప్పటికీ  నిధులు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఒక్క అడుగు ముందుకుపడలేదు. అయితే కిందటేడు పైసలు, లబ్ధిదారులకు గ్రౌండింగ్‌‌‌‌ ఇంకా కాలేదు.

అయినోళ్లకే ఇచ్చుకున్నరు!
ఎమ్మెల్యేలు తమకు ఇష్టమైన్నోళ్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు, ప్రజాప్రతినిధులను స్కీం లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని ఆరోపణలు బహిరంగంగానే వినిపించారు. పేద ఎస్సీల దరఖాస్తులను ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదనే ఆరోపణ ఉంది. లబ్ధిదారుల లిస్ట్‌‌‌‌లో పేరుండాలంటే తమకు కమీషన్ ఇవ్వాలని ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు డిమాండ్​ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే కొత్తగా ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌ అధికారులు రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం అధికారులే లబ్ధిదారులను గుర్తించనున్నారు. సర్కారు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇస్తే ప్రత్యేకంగా గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ తీసుకొచ్చి అమలు చేసే అవకాశం ఉంది.