కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

న్యూఢిల్లీ : స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయించాలంటూ అడ్వకేట్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇటువంటి అంశాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని.. వాటిలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​ నేతృత్వంలోని బెంచ్​ ఈ వ్యాఖ్యలు చేసింది.స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని తాము పార్లమెంటుకు మాండమస్​(ఎక్స్​ట్రాడినరీ రిట్) ను జారీ చేయలేమని బెంచ్​ స్పష్టం చేసింది.

ఒకవేళ తాము ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరిస్తే.. దానికి అనుగుణంగా కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లు, మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే ఇందుకు అనుగుణంగా మహిళల కనీస వివాహ వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలని పిటిషనర్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ కోరారు. పురుషాధిక్య దృక్పథంతోనే మనదేశంలో పురుషుల వివాహ వయసును ఎక్కువగా, మహిళల వివాహ వయసును తక్కువగా ఉంచారని పిటిషన్ లో​ పేర్కొన్నారు.