
- వాళ్లను అంబులెన్స్‌లో ఎందుకు తీస్కపోలేదు?
- గ్యాంగ్‌స్టర్ హత్యపై యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు
- మూడు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం
న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ మర్డర్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తీసుకొస్తున్న విషయం కిల్లర్స్‌కు ఎలా తెలిసిందని ప్రశ్నించింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఆ ఇద్దరినీ ఆస్పత్రి గేటు వరకు అంబులెన్స్‌లో తీసుకుకెళ్లకుండా నడిపించుకుంటూ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించింది. ప్రయాగ్‌రాజ్‌లో ఏప్రిల్ 15న చెకప్ కోసం ఆ ఇద్దరిని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. జర్నలిస్టుల ముసుగులో వచ్చిన దుండగులు అతీక్‌ను, అష్రఫ్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపేశారు. ఆపై పోలీసులకు లొంగిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. హత్య ఘటనపై పూర్తి రిపోర్టు సమర్పించాలని యూపీ సర్కారును ఆదేశించింది. ఏప్రిల్ 13న ఝాన్సీలో జరిగిన అతీక్ కొడుకు అసద్ ఎన్కౌంటర్పైనా నివేదిక ఇవ్వాలని కోరింది.
కోర్టు ఆదేశాల మేరకే ఆస్పత్రికి: యూపీ సర్కారు
కోర్టు ఆదేశాల మేరకే అన్నదమ్ములిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లామని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన లాయర్ ముకుల్ రోహత్గీ సమాధానమిచ్చారు. ఈ విషయం మీడియాకు కూడా తెలిసిందన్నారు. పేరు మోసిన గ్యాంగ్స్టర్అయిన అతీక్‌ను హత్య చేస్తే తమకు గుర్తింపు వస్తుందనే చంపేసినట్లు హంతకులు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారని రోహత్గీ కోర్టుకు తెలిపారు. ‘‘హంతకులు న్యూస్ ఫొటోగ్రాఫర్ల వేషంలో వచ్చారు. వాళ్ల వద్ద పాస్‌లు, కెమెరాలు, గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయి. అతీక్, అష్రఫ్‌లను అలా చంపగలిగారు” అని కోర్టుకు వెల్లడించారు. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు కమిషన్‌ను నియమించిందని పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్ అనుమానాలు లేవనెత్తారు. ఎంక్వయిరీ కమిషన్ విషయంలోనూ ప్రభుత్వ పాత్ర అనుమానాస్పదంగా ఉందన్నారు. దీంతో 3 వారాల్లోనే అతీక్, అష్రఫ్ మర్డర్‌పై రిపోర్టు ఇవ్వాలని సర్కారును కోర్టు ఆదేశించింది. గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ చౌహాన్ కమిషన్ నివేదక ఇచ్చిన తర్వాత యూపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో రిపోర్టులో వివరించాలని పేర్కొంది.