- 2 లక్షల మంది స్టూడెంట్ల భవిష్యత్తును
- రిస్క్‌లో పెట్టలేమన్న అత్యున్నత కోర్టు
న్యూఢిల్లీ: నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయడం కుదరదని, కొద్దిమంది కోసం 2 లక్షల మంది స్టూడెంట్ల కెరీర్‌ను రిస్క్ లో పెట్టలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. కేవలం రెండు రోజుల ముందు పరీక్షను వాయిదా వేయాలని ఎలా ఆదేశించగలమని ప్రశ్నించింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ పరీక్షను ఇప్పుడు మరోసారి వాయిదా వేయడం వల్ల ఇటు 2 లక్షల మంది స్టూడెంట్లతో పాటు వారి పేరెంట్స్ 4 లక్షల మందిపైనా దీని ప్రభావం పడుతుందని గుర్తుచేసింది. ఈమేరకు ఆదివారం జరగనున్న నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కామెంట్స్ చేసింది. పరీక్ష యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.
ఏమిటీ పిటిషన్..
దేశంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. నీట్ పీజీ గా వ్యవహరించే ఈ పరీక్ష ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం జులై 22న జరగాల్సి ఉంది. అయితే, నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు, వివాదాల నేపథ్యంలో పీజీ పరీక్షను బోర్డు తొలుత జులై 31కి, తర్వాత ఆగస్టు 11కు వాయిదా వేసింది. తాజాగా గురువారం విద్యార్థులకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ల వివరాలను విడుదల చేసింది. అయితే, ఇంత తక్కువ వ్యవధిలో ఢిల్లీలాంటి మహానగరాలలో పరీక్ష కేంద్రాలను గుర్తించి, పరీక్ష టైమ్‌కు అక్కడికి చేరుకోవడం సాధ్యంకాదని కొంతమంది విద్యార్థులు కోర్టుకెక్కారు. రెండు సెషన్లుగా నిర్వహించే నీట్ పీజీ పరీక్షలో విద్యార్థులు సాధించే స్కోర్ల నార్మలైజేషన్‌కు ఏ ఫార్ములా ఉపయోగిస్తారనే వివరాలనూ బోర్డు వెల్లడించలేదని చెప్పారు. దీంతో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
