సబ్​కాంట్రాక్టర్​పై కార్పొరేటర్ ​భర్త దాడి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఎల్బీనగర్, వెలుగు : సబ్​కాంట్రాక్ట్​ తీసుకున్న వ్యక్తి డబ్బులు అడగ్గా కులం పేరుతో దూషించి..దాడి చేశాడని ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధ భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితుల కథనం ప్రకారం..పెద్దపల్లికి చెందిన దాసరి హనుమయ్య అనే కాంట్రాక్టర్ ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డికి వచ్చిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్-–1 పనులను సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు.

పనులు పూర్తి చేసినా కాంట్రాక్ట్ డబ్బులు రూ.31 లక్షలు ఇవ్వకపోవడంతో అడిగేందుకు శనివారం తన ఫ్రెండ్స్​భాస్కర్​, దాసరి కిషన్, అముదాల నర్సయ్య, వల్లపు వంగీలతో కలిసి ఆర్కేపురంలోని ధీరజ్ రెడ్డి ఆఫీసుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంత డబ్బు ఇచ్చేది లేదని ధీరజ్​రెడ్డి చెప్పడంతో భాస్కర్ కలుగజేసుకున్నాడు. దీంతో భాస్కర్ ను ధీరజ్ రెడ్డి  కులం పేరుతో తిట్టాడు. తర్వాత హనుమయ్యపై దాడి చేశాడు.

రక్తంతో తడిసిన దుస్తులను తీసేసి వేరే దుస్తులు వేసి పంపించాడు. దీంతో హనుమయ్య, అతడి స్నేహితులు చైతన్యపురి పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. దీంతో ధీరజ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు తన ఆఫీసులో ఉన్న దళిత మోర్చా లీడర్​ప్రవీణ్ కుమార్ ను హనుమయ్య, అతడి అనుచరులు కులం పేరుతో దూషించారని ఆయన కూడా ఫిర్యాదు చేశారు. దీంతో హనుమయ్య , అతడి అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు.  కాగా, బీఆర్​ఎస్​ లీడర్​ఆర్​ఎస్​ప్రవీణ్​కుమార్​ఎల్బీనగర్​దవాఖానలో చికిత్స పొందుతున్న హనమయ్యను పరామర్శించారు. నిందితుడైన ధీరజ్​రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్​చేశారు.