ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు..స్పెషల్ కోటా ఇవ్వాల్సిందే! : పార్టీల లీడర్లు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు..స్పెషల్ కోటా ఇవ్వాల్సిందే! : పార్టీల లీడర్లు
  • 2024 నుంచే అమలు చేయాలె .. ప్రతిపక్ష మహిళా లీడర్ల డిమాండ్

న్యూఢిల్లీ :  లోక్​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా ఉన్న పలు పార్టీల లీడర్లు హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక కోటాలు కల్పించాల్సి ఉందని బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి అన్నారు. బలహీన వర్గాలకు కోటాలో కోటా ఉండాల్సిందే అని నొక్కి చెప్పారు. ఈ బిల్లులో కేంద్రం జిమ్మిక్కులు ఉన్నాయని, కొందరికి మాత్రమే అర్థం అవుతున్నదని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. చాలా ఏండ్ల కింద బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీసుకొచ్చిన మహిళల కోట నుంచి స్ఫూర్తి పొందిందని జేడీ(యూ) నేషనల్ జనరల్ సెక్రటరీ రజీబ్ రంజన్ అన్నారు. బీహార్​లో 2006లోనే లోకల్​బాడీ, పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచిందని తెలిపారు. 2005లోనే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితీశ్​కుమార్ నెలల వ్యవధిలోనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్లు జెండర్ జస్టిస్, సోషల్ జస్టిస్ సమానంగా ఉండాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మహిళలకు కేటాయించిన సీట్లలో వెనుకబడిన, దళిత, మైనారిటీ, గిరిజనుల వాటాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల మహిళలకు రిజర్వేషన్​లో సెపరేట్ వాటా కల్పించాలని సమాజ్​వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరీ డిమాండ్ చేశారు. వీళ్లకు ఎంత రిజర్వేషన్లు ఇస్తున్నారనేది తమ ప్రశ్న అని అన్నారు. అప్పుడు యూపీఏ, ఇప్పుడు ఎన్డీఏ ఈ బిల్లు తీసుకొచ్చినా వ్యతిరేకించామని తెలిపారు.

కోటాలో కోటా ఉండాల్సిందే..: మాయావతి

చాలా ఏండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి ఆమోదం పొందుతుందని బీఎస్పీ చీఫ్ మాయావతి ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కోటా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఉన్న కులాల వర్గీకరణ ఆధారంగా వెనుకబాటుకు గురైన వారిలో అన్ని వర్గాల మహిళలు ఉన్నారని, వెనుకబడిన సామాజిక వర్గాల మహిళలు మరింత వెనుకబడిపోయి ఉన్నారని, వారికి చేయూతనివ్వడం నైతిక బాధ్యతని మాయావతి అన్నారు. 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను మోసం చేసేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అతిషి విమర్శించారు. 2024లోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్​ చేశారు. దాన్ని ఇప్పుడు అమలు చేయకపోవడమంటే.. మహిళలను మోసం చేయడమే అని మండిపడ్డారు. 2026 తర్వాత అమలు చేస్తామనడం సరికాదన్నారు. డీ లిమిటేషన్ క్లాస్ చేర్చడం సరికాదని విమర్శించారు. లోక్​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడంపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ మోదీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.