కాలేజీలో బుర్ఖా ధరించొచ్చు.. స్టూడెంట్స్ నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు

కాలేజీలో బుర్ఖా ధరించొచ్చు.. స్టూడెంట్స్  నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు

 

  • నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ స్టూడెంట్లకు ఉంది: సుప్రీంకోర్టు
  • ఏ డ్రెస్ వేసుకోవాలో మీరెలా డిసైడ్ చేస్తారు?
  • పేర్లు రిలీజియన్​ను బయటపెట్టట్లేదా?
  • బొట్టు, బిందీని ఎందుకు నిషేధించలేదు?
  • ముంబైలోని ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీని ప్రశ్నించిన బెంచ్
  • హిజాబ్, బుర్ఖా, క్యాప్​ను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్​పై స్టే

న్యూఢిల్లీ: నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఏ విద్యాసంస్థ అయినా సరే విద్యార్థులను డ్రెస్సింగ్​విషయంలో బలవంతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. క్యాంపస్​లో హిజాబ్, బుర్ఖా, క్యాప్, నఖాబ్​ను నిషేధిస్తూ ముంబైలోని ఓ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్​పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తమకు నచ్చినట్లు ఉండాలని కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్లను ఆదేశించడం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్​తో కూడిన బెంచ్ పేర్కొంది. ఈమేరకు ఎన్​జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీలను నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 18 లోపు విద్యార్థినుల డ్రెస్ కోడ్​పై విధించిన నిషేధంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్​జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీ జారీ చేసిన సర్క్యూలర్​లను సవాల్‌‌ చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. కాలేజీ జారీ చేసిన సర్క్యులర్​ను బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌‌ చేస్తూ వారు సుప్రీం కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. హిజాబ్, బుర్ఖా నిషేధం కారణంగా విద్యార్థినులు క్లాసులకు హాజరుకాలేకపోతున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు.

క్లాస్ రూముల్లో బుర్ఖా వేయొద్దు

‘‘ఏ డ్రెస్సు వేసుకోవాలన్నది విద్యార్థినులే డిసైడ్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ వేయాలి.. ఈ డ్రెస్ వేయొద్దు.. అనే హక్కు ఏ కాలేజీకి లేదు. దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయన్న విషయం మీకు తెలీదా? సడెన్​గా నిద్రలో నుంచి లేచినట్లు ఉంది మీ వ్యవహారం. అమ్మాయిల డ్రెస్సింగ్​ను మీరు నిర్ణయించడం దురదృష్టకరం. స్టూడెంట్ల పేర్లు వారి మతపరమైన గుర్తింపును బయటపెట్టట్లేదా? అలాగని ఇకపై వారిని నంబర్లతో పిలుస్తారా? స్టూడెంట్ల మత విశ్వాసాలను బహిర్గతం చేయకూడదనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యాలు తిలక్(బొట్టు), బిందీలను ఎందుకు నిషేధించలేదు?’’అని ప్రశ్నించింది. క్లాస్ రూమ్​లో అమ్మాయిలు బుర్ఖా ధరించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. క్యాంపస్​లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని పేర్కొన్నది.