
- బీసీలకు 42% రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ వంగా గోపాల్ రెడ్డి పిటిషన్
న్యూఢిల్లీ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (అక్టోబర్ 6) విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను చాలెంజ్ చేస్తూ వంగా గోపాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన 50% రిజర్వేషన్ పరిమితిని మించి ఉందని..ఇది రాజ్యాంగ విరుద్ధమని వంగా గోపాల్ రెడ్డి తన పిటిషన్‌లో తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67% పెరుగుతున్నాయన్నారు.
అందువల్ల జీవో 9ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసిందని పేర్కొన్నారు. గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ ను ఈ నెల ఒకటవ తేదీన పరిగణనలోకి తీసుకోన్న సుప్రీంకోర్టు... ఈ నెల ఆరో తేదీన విచారణ చేపడతామని కేసుల జాబితాలో చేర్చింది. ఇదిలా ఉండగా, బీసీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ మాధవరెడ్డి, మరొకరు దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 8వ తేదీన విచారించనుంది. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు జారీ చేయబోయే ఆదేశాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.