తెలుగు అకాడమీలో స్కామ్‌.. 330 కోట్లకు స్కెచ్

తెలుగు అకాడమీలో స్కామ్‌.. 330 కోట్లకు స్కెచ్

హైదరాబాద్‌‌, వెలుగు: తెలుగు అకాడమీ ఎఫ్‌‌డీ స్కామ్‌‌లో రోజుకో  కొత్త కోణం బయటపడుతోంది. యూబీఐ మేనేజర్‌‌‌‌ మస్తాన్‌‌వలీ పోలీసుల విచారణలో కీలక సమాచారం బయటపెట్టినట్లు తెలుస్తోంది. పాత నేరస్తుడు సాయికుమార్‌‌ నేతృత్వంలోని ఫోర్జరీ‌‌ గ్యాంగ్‌‌ రూ.330 కోట్ల ఉమ్మడి అకాడమీ సొమ్ము కొట్టేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మస్తాన్‌‌వలీని బుధవారం నుంచి ఆరురోజుల పాటు పోలీస్‌‌ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్‌‌ సొసైటీ చైర్మన్ సత్యనారాయణరావు, పద్మావతి సహా మరో నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు. సంతోష్‌‌నగర్‌‌‌‌, కార్వాన్‌‌, చందానగర్‌‌‌‌లోని కెనరా బ్యాంకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ సీజ్‌‌ చేశారు. యూబీఐ బ్యాంక్‌‌మేనేజర్ మస్తాన్‌‌వలీ స్టేట్‌‌మెంట్‌‌రికార్డ్‌‌చేశారు. సోమవారంతో మస్తాన్‌‌వలీ కస్టడీ ముగియడంతో చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.

ఇద్దరు మేనేజర్లు.. 8 మంది ఏజెంట్లు

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌‌ రికార్డ్‌‌ చేశారు. ఇందులో అగ్రసేన్ బ్యాంక్‌‌ నుంచి విత్‌‌డ్రా చేసిన డబ్బులో రూ.20 కోట్లు ఏజెంట్‌‌ సాయికుమార్‌‌‌‌ తీసుకున్నట్లు గుర్తించారు. అకౌంట్స్ ఇన్​చార్జి రమేశ్​ నుంచి కీలక సమాచారం సేకరించారు. అకాడమీకి చెందిన రూ.330 కోట్లు విడతల వారీగా డ్రా చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సంబంధిత బ్యాంకులకు చెందిన డాక్యుమెంట్స్‌‌ను ఫోర్జరీ చేసేందుకు కూడా యత్నించినట్లు తెలిసింది. ప్లాన్​లో భాగంగానే అకాడమీకి చెందిన 43ఎఫ్‌‌డీ అకౌంట్స్‌‌ను క్లోజ్​చేయాలనుకున్నారని తేలింది. ఈ మేరకు బ్యాంక్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌తో పాటు అకాడమీ, బ్యాంక్‌‌ సిబ్బంది స్టేట్‌‌మెంట్స్‌‌ రికార్డ్‌‌ చేశారు.

టర్నోవర్ చేసి రీ ఫండ్‌‌

సాయికుమార్ ఫోర్జరీ గ్యాంగ్ కొట్టేసిన ఎఫ్‌‌డీలను వచ్చే ఏడాది జూన్‌‌లోగా డిపాజిట్‌‌ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం రియల్‌‌ ఎస్టేట్‌‌లో పెట్టుబడులు పెట్టారు. ఇలా అగ్రిమెంట్లు కొనుగోల్లు చేసిన ల్యాండ్స్‌‌ను రీ సెల్‌‌ చేయాలని అనుకున్నారు. రొటేషన్‌‌ పద్ధతిలో మనీ సర్క్యులేషన్ ప్రారంభించారు. అకాడమీ ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ల గడువు పూర్తి అయ్యేలోగా కలెక్ట్‌‌ చేయాలని స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే ఫేక్ ఎఫ్‌‌డీఆర్‌‌‌‌లను వారం రోజులు,15 రోజులు, నెల రోజులుగా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్‌‌ చేశారు. ఈ క్రమంలోనే కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనకు రూ.2 కోట్లు కమీషన్ ఇచ్చారు. ఈ కేసులో మస్తాన్‌‌వలీ తన వాటాగా రూ.2.5 కోట్లు తీసుకున్నాడు. ఏపీ మర్కంటైల్‌‌ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌‌ సత్యనారాయణ తన కమీషన్‌‌గా రూ.10 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.