పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’. రేపు శుక్రవారం (2026 జనవరి 9న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వరుస ప్రమోషన్లతో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా క్రియేటివ్ ప్రొడ్యూసర్ SKN లేటెస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి. రాజా సాబ్ సినిమా థియేటర్ల కేటాయింపు విషయంలో నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
“ ఈ సంక్రాంతి పండుగకి ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు థియేటర్ల విషయంలో కొరత ఏర్పడుతుంది. ఇలా పాన్ ఇండియా సినిమాలకు థియేటర్, జీఓ సమస్యలు కామన్. నిర్మాత TG విశ్వప్రసాద్ గారు గతంలో నిర్మించిన మిరాయ్ బాగా ఆడుతున్న సమయంలో, ఓ పెద్ద సినిమా (ఓజి) కారణంగా కొన్ని థియేటర్లు తీసేశారని గుర్తు చేశారు.
ALSO READ : శివాజీ ఉద్దేశం మంచిదే..
ఇప్పుడు అదే విశ్వప్రసాద్ తీసిన రాజా సాబ్ రిలీజ్ అవుతున్నందున, అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలంతా రాజాసాబ్ సినిమాకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరి పేర్లను సంక్రాంతి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తానని చెప్పారు.
“ఒక థియేటర్ ఇస్తే వందసార్లు చెబుతాను, అది కూడా ఇవ్వకపోతే 200 సార్లు చెబుతాను” అంటూ థియేటర్ సమస్య తీవ్రతను స్పష్టంగా చెప్పారు. ఎన్ని థియేటర్లు ఇచ్చినా, సినిమా రిలీజయ్యాక కొంతకాలానికి కౌంట్ తగ్గిపోవడం తప్పదని, కొన్ని థియేటర్లను వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన పరోక్షంగా తెలిపారని అర్ధమవుతుంది.
ఇక చివరగా ‘ప్రీమియర్స్ తర్వాత ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్, మారుతి టేకింగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ గురించి మాట్లాడుకుంటారని’ ప్రొడ్యూసర్ SKN ఆశాభవం వ్యక్తం చేశారు. అలాగే, రేపటి నుంచి సినిమా గ్రామర్, తమన్ మ్యూజిక్, మారుతి మేకింగ్ గురించే చర్చ జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పండగకు రిలీజ్ అవుతున్న అన్ని హీరోల సినిమాలు హిట్ కావాలని, రాజా సాబ్ ప్రీమియర్స్‌తో (జనవరి 8న) మారుతి రేంజ్ ఏంటో క్లారిటీ వస్తుందని నిర్మాత SKN అన్నారు.
ALSO READ : ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రిలీజ్..
అయితే, 2026 సంక్రాంతి బరిలో ప్రభాస్ నటించిన రాజా సాబ్తో పాటుగా చిరు-అనిల్ మూవీ, రవితేజ-కిషోర్ తిరుమల మూవీస్ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా థియేటర్ల సమస్య తెరపైకి వచ్చింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘రాజా సాబ్’కు తగినంత థియేటర్లు దక్కడం లేదన్న కారణంతోనే నిర్మాత SKN ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం.
ఎందుకంటే నైజాంలో ‘రాజా సాబ్’ను రిలీజ్ చేసేది మైత్రి మూవీ మేకర్స్ కాగా, శంకర్ వరప్రసాద్ సినిమా విడుదల బాధ్యతలు దిల్ రాజు చేతుల్లో ఉన్నాయి. దీంతో ఈ రెండు భారీ బ్యానర్ల మధ్య సినిమాల పరంగానే కాదు, థియేటర్ల కేటాయింపుల విషయంలో కూడా గట్టి పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో SKN చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాల్సి ఉంది.
