Anasuya Bharadwaj: శివాజీ ఉద్దేశం మంచిదే.. కానీ అదే నచ్చలేదంటూ అనసూయ వీడియో!

Anasuya Bharadwaj: శివాజీ ఉద్దేశం మంచిదే.. కానీ అదే నచ్చలేదంటూ అనసూయ వీడియో!

టాలీవుడ్ నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్స్ వస్త్రాధారణపై చేసిన వ్యాఖ్యలు, ఆపై తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే . ఈ విషయంలో మొదట గట్టిగా స్పందించిన నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. లేటెస్ట్ గా మరోసారి శివాజీ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. అయితే ఈసారి ఆమె మాటల్లో శివాజీ పట్ల గౌరవం కనిపిస్తూనే.. తన అసలు అభ్యంతరం ఎక్కడో స్పష్టం చేసింది

శివాజీ ఉద్దేశం మంచిదే.. కానీ ఆ విధానమే?

తన సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ స్వయంగా హాజరై వివరణ ఇవ్వడం కూడా జరిగాయి. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతూ శివాజీ క్షమాపణ కూడా చెప్పారు. తన ఉద్దేశం మంచిదే .. రెండు పదాలు మాట్లాడకుండా ఉంటే బాగుండేదని తన తప్పును అంగీకరించారు.  అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన అనసూయకు శివాజీ అంశంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. శివాజీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన ఎన్నో మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినేలా గుర్తింపు సంపాదించుకున్నారు. మహిళల భద్రత గురించి ఆయన ఆందోళన చెందడం వెనుక ఉన్న ఉద్దేశం ఖచ్చితంగా మంచిదే అని పేర్కొన్నారు.

ఆ ఒక్క పాయింట్ ఉంటే బాగుండేది...

శివాజీ చెప్పిన మాటల్లో మంచి ఉంది అని అంగీకరిస్తూనే, ఆయన ఎంచుకున్న పద్ధతిపై అనసూయ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కేవలం మహిళలను హెచ్చరించడం , నియంత్రించడం ద్వారా మార్పు రాదని ఆమె అభిప్రాయపడ్డారు.  కేవలం అమ్మాయిలకే జాగ్రత్తలు చెప్పడం కాకుండా, అబ్బాయిలకు కూడా సమాజంలో తమ బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పుకొచ్చింది. అమ్మాయిలకు వారికి నచ్చినట్లు ఉండనివ్వండి.. అవసరమైతే వారికి రక్షణగా నిలబడదాం అని  అబ్బాయిలకు  చెప్పి ఉంటే ఆ సందేశం మరింత అర్థవంతంగా ఉండేదని అనసూయ వివరించారు. ఆపదలో ఉన్నప్పుడు తోటివారికి అండగా ఉండాలని సరళమైన భాషలో, సానుకూల ధోరణిలో చెప్పి ఉంటే ఈ వివాదమే వచ్చేది కాదని ఆమె చెప్పుకొచ్చారు.

మొత్తానికి అనసూయ వ్యాఖ్యలు చూస్తుంటే, ఆమె శివాజీ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూనే.. సామాజిక అంశాలపై మాట్లాడేటప్పుడు జెండర్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. శివాజీ ఉద్దేశాన్ని తప్పుపట్టకపోయినా, ఆయన వాడిన భాష, కోణంపైనే ఆమె తన అభ్యంతరాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.