బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతుంటే కేసీఆర్ నోరు మెదపలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 4.3 టీఎంసీల నుండి ఏకంగా 13.7 టీఎంసీలకు పెంచినా నోరు మెదపని సన్నాసి కేసీఆర్ అని అన్నారు.
ప్రజలను డైవర్టు చేసేందుకే కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం ప్రాజెక్టును కట్టారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో భారీ దోపిడీ కి స్కెచ్ వేశాడని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్ల క్రిష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రం అనేకసార్లు హెచ్చరించిందని అన్నారు. ఎన్నిసార్లు నిలదీసినా మమ్ముల్ని పిట్టకథలు చెబుతూ కేసీఆర్ హేళన చేశారన్నారు. నీళ్ల విషయంలో పాలకుల తప్పిదాలను సరిదిద్దేందుకు కేంద్రం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లను ఏర్పాటు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దోపిడీకి స్కె్చ్ వేసింది కేసీఆర్ అని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. రూ.30వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచి దోచుకున్న దోపిడీ దొంగ కేసీఆర్ అని అన్నారు.
కేసీఆర్ పాలనలో ఏపీలో అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందన్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై పత్రికల్లో, టీవీల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఒప్పందానికి మించి 38 టీఎంసీల నీళ్లను ఏపీ ప్రభుత్వం అదనంగా వాడుకుందని మొత్తుకున్నా కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.
అప్పటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టుకుని ‘బేసిన్లు లేవ్... బేషజాల్లేవ్’ అని మాట్లాడింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నాటి మంత్రి రోజా గులాబీ రేకులతో స్వాగతం పలికితే వెళ్లి రోయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ చెప్పింది నిజం కాదా..నీళ్ల విషయంలో కేసీఆర్ తెలంగాణ విలన్ గా మారారని ఆరోపించారు.
