కోటి కంటే ఖరీదైన ఇళ్లకే మస్త్ డిమాండ్.. హైదరాబాద్ రియల్టీ ట్రెండ్ ఇలా..

కోటి కంటే ఖరీదైన ఇళ్లకే మస్త్ డిమాండ్.. హైదరాబాద్ రియల్టీ ట్రెండ్ ఇలా..

భారత రియల్ ఎస్టేట్ రంగం 2025లో సరికొత్త మలుపు తిరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు స్థిరంగా సాగుతుండగా.. సామాన్యుడికి అందుబాటులో ఉండే 'అఫోర్డబుల్' ఇళ్ల కంటే కోటి రూపాయల పైబడిన 'ప్రీమియం' ఇళ్లకే ఆదరణ పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా రిపోర్ట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఇళ్ల అమ్మకాల్లో దాదాపు సగం వాటా ఖరీదైన లగ్జరీ ఇళ్లదే కావడం మారిన అభిరుచులు, ప్రజల ఆర్థిక పరిస్థితులను సూచిస్తోంది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు: 
నివేదికలో భాగ్యనగరం తన ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్‌లో 2025 సంవత్సరంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు 4 శాతం వృద్ధి చెంది 38వేల403 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే అమ్మకాల సంఖ్య కంటే ధరల పెరుగుదల ఇక్కడ ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్‌లో ఇంటి ధరలు ఏడాది కాలంలో ఏకంగా 13 శాతం పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రీమియం, విలాసవంతమైన ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2025 ద్వితీయార్థంలో అమ్ముడైన ఇళ్లలో 71 శాతం వాటా కోటి రూపాయల పైబడినవే కావడం భాగ్యనగరంలో మారుతున్న కొనుగోలు శక్తికి నిదర్శనం అంటున్నారు రియల్టీ నిపుణులు.

ALSO READ : ట్రంప్ నిర్ణయంతో కుప్పకూలిన టెక్స్‌టైల్, రొయ్యల స్టాక్స్..

మెట్రో నగరాల తీరుతెన్నులు: 
దేశంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ముంబైలో 2025లో 97వేల188 యూనిట్ల అమ్మకంతో తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. చెన్నై 12 శాతంతో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇక బెంగళూరులో హౌసింగ్ సేల్స్ స్థిరత్వాన్ని ప్రదర్శించగా, ఢిల్లీ ప్రాంతంలో మాత్రం అమ్మకాలు 9 శాతం తగ్గుముఖం పట్టాయి. అయితే ధరల పెరుగుదలలో మాత్రం ఢిల్లీ 19 శాతంతో అగ్రస్థానంలో నిలవగా.. హైదరాబాద్ 13 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. నిర్మాణ వ్యయాలు పెరగడం, భూముల ధరలు ఆకాశాన్ని తాకడం దీనికి కారణాలుగా తేలింది. 

ALSO READ : అమెరికా కొత్త చట్టంతో.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

లగ్జరీపైనే మనసుపడుతున్న కొనుగోలుదారులు: 
ప్రస్తుతం మార్కెట్ విశ్లేషణ ప్రకారం.. 50 లక్షల లోపు ఇళ్ల విక్రయాలు 17 శాతం పడిపోయాయి. ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన ఈ విభాగం ఇప్పుడు కేవలం 21 శాతానికి పరిమితమైంది. ఇదే సమయంలో కోటి రూపాయల పైబడిన ఇళ్ల విక్రయాలు 14 శాతం వృద్ధి చెందాయి. కొనుగోలుదారులు ఇప్పుడు కేవలం నివాసం కోసమే కాకుండా.. ఆధునిక వసతులు, విశాలమైన గదులు ఉన్న ప్రీమియం ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని, మార్కెట్ స్థిరంగా ఉంటుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు.