అమెరికా కొత్త చట్టంతో.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

అమెరికా కొత్త చట్టంతో.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు కొత్త టారిఫ్స్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో భారతీయ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉదయం స్వల్ప నష్టాలతో స్టార్ట్ అయిన సూచీలు ఆ తర్వాత మధ్యాహ్నం నాటికి భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో అన్ని రంగాలు నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి ఇంట్రాడేలో. దీంతో మధ్యాహ్నం 12.09 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 630 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 220 పాయింట్లు లాస్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 330 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 930 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. 

మెుత్తానికి భారతీయ స్టాక్ మార్కెట్లు ట్రంప్ తీసుకొస్తున్న 500 శాతం సుంకాలపై భారీగానే రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలో మార్కెట్ల పతనానికి వెనుక కారణాలను పరిశీలిస్తే.. 

1. విదేశీ పెట్టుబడిదారుల వెనక్కి తగ్గుదల: 
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 3వ రోజు కూడా షేర్లను అమ్మేశారు. ఒక్క బుధవారం రోజునే రూ.వెయ్యి527 కోట్లు వెనక్కి తీసుకోగా.. ఈ జనవరిలో ఇప్పటివరకు మొత్తం రూ.5వేల760 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం.

2. టారిఫ్ భయాలు & వాణిజ్య ఒప్పందం: 
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం మార్కెట్లను కుదిపేస్తోంది. భారత్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇప్పటికే కొన్ని వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు ఉన్నాయి.

3. క్రూడాయిల్ ధరల పెరుగుదల: 
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 0.4 శాతం పెరిగి 60.20 డాలర్లకు చేరింది. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది ప్రతికూల అంశం.

4. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు: 
జపాన్, హాంకాంగ్ వంటి ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండటం, అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగియడం కూడా దేశీయ సూచీలపై ప్రభావం చూపింది.

5. వీక్లీ ఎక్స్‌పైరీ: 
సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ రోజు కావడంతో మార్కెట్‌లో తీవ్ర ఓలటాలిటీ చోటుచేసుకున్నాయి.