తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

దేశంలో షెడ్యూల్డ్​ కులాలు, తెగలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురయ్యాయి. వీరి అభ్యున్నతికి భారత రాజ్యాంగ నిర్మాతలు విస్తారమైన రాజ్యాంగ రక్షణలను కల్పించారు. విద్యాపరంగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పించడం కోసం కృషిచేశారు. పోటీ పరీక్షల దృష్ట్యా షెడ్యూల్డ్​ కులాలు, తెగలకు రాజ్యాంగంలో కల్పించిన రక్షణల గురించి తెలుసుకుందాం. 

షెడ్యూల్డ్​ కులాలు

ఆర్టికల్​ 16(4): ప్రకారం ప్రభుత్వోద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొందలేకపోయిన వర్గానికి రిజర్వేషన్​ కల్పించవచ్చు. ఈ నియమం ద్వారా ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. 

ఆర్టికల్​ 16(4A): ప్రభుత్వ ఉద్యోగాల్లో పొందే ప్రమోషన్ల విషయంలో కూడా షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. 

ఆర్టికల్​ 16(4B): షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగలు, బ్యాక్​లాగ్​ ఖాళీల భర్తీ సమయంలో 50శాతం రిజర్వేషన్​ దాటడం అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు. దీని ద్వారా క్యారీ ఫార్వార్డ్​ వేకన్సీస్​ భర్తీకి అవకాశం కల్పించబడింది. 

ఆర్టికల్​ 17: అంటరానితనం ఏ రూపంలో పాటించినా అది చట్టం ద్వారా శిక్షించదగిన నేరం అవుతుంది. 

ఆర్టికల్​ 46: షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగలు, ఇతర బలహీనవర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలు కాపాడి వారిని సామాజిక అన్యాయానికి, గురికాకుండా పరిరక్షించాలి. 

ఆర్టికల్ 330, ఆర్టికల్​ 332: పార్లమెంట్, రాష్ట్ర విధాన సభల్లో షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్​ తెగల వారికి కొన్ని సీట్లు కేటాయించడం
రాజ్యాంగంలోని 9, 9ఏ భాగాల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో సభ్యుల ఎన్నికకు షెడ్యూల్డ్​ కులాలు, తెగల వారికి ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో గల వారి జనాభాను బట్టి సీట్లను రిజర్వ్​ చేయాలి.

ఆర్టికల్​ 335: షెడ్యూల్డ్​ కులాల, షెడ్యూల్డ్​ తెగల సమస్యల పరిష్కారానికి, పరిపాలన సామర్థ్యానికి అనుగుణంగా, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోని వివిధ పోస్టుల్లో, సేవల్లో వారిని నియమించడం.

ఆర్టికల్​ 338:షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగల జాతీయ కమిషన్​ ప్రకారం వారి పరిరక్షణ కోసం అన్ని విషయాలను పరీక్షించి, పర్యవేక్షించడం, ప్రత్యేక ఫిర్యాదులను విచారించడం, వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తదితరాల ప్రణాళిక ప్రక్రియలో పాల్గొని సలహాలు ఇవ్వడం. 

షెడ్యూల్డ్​ తెగల రాజ్యాంగ నిబంధనలు

రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లు గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించినవి. కింద వివరించిన నిబంధనలన్నింటిని గిరిజలను భారతీయ సమాజ ప్రధాన స్రవంతిలో కలిపేందుకు రూపొందించారు. 

విద్యా, సాంస్కృతిక పరిరక్షణలు

ఆర్టికల్ 15(4): ఇతర వెనకబడిన తరగతుల పురోగతికి ప్రత్యేక ప్రకరణలు (షెడ్యూల్డ్​ తెగలను కలుపుకొని) 

ఆర్టికల్​ 29: అల్పసంఖ్యాక వర్గాల అవసరాల పరిరక్షణ(షెడ్యూల్డ్​ తెగలతో కలుపుకొని) 

ఆర్టికల్46: ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో బలహీనవర్గాలు, ప్రత్యేకంగా షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగల విద్య, ఆర్థిక అవకాశాలను వృద్ధి చేయడం, సామాజిక న్యాయం, ఇతర రకాల దోపిడీల నుంచి రక్షించడం

ఆర్టికల్​ 350: ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించడం

ఆర్టికల్​ 350: మాతృభాషలో బోధన 

ఆర్థిక రక్షణలు

ఆర్టికల్​ 244: ఐదో షెడ్యూల్లో 1వ నిబంధన అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్​ తెగలు, షెడ్యూల్డ్​ ప్రాంతాల పరిపాలన, నియంత్రణకు వర్తిస్తుంది. ఆర్టికల్​ 275: రాజ్యాంగంలోని ఐదో, ఆరో షెడ్యూళ్ల కింద ప్రత్యేక రాష్ట్రాలకు (షెడ్యూల్డ్​ తెగలు, షెడ్యూల్డ్​ ప్రాంతాలు) గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​ ఇస్తారు. 

రాజకీయ పరిరక్షణలు 

ఆర్టికల్ 164(1): బిహార్​, మధ్యప్రదేశ్​, ఒరిస్సాల్లో గిరిజన మంత్రిత్వశాఖలు నిర్వహిస్తాయి. 

ఆర్టికల్​ 330: షెడ్యూల్డ్​ తెగలకు లోక్​సభలో కొన్ని సీట్లను రిజర్వ్​ చేయడం

ఆర్టికల్​ 337: షెడ్యూల్డ్​ తెగలకు రాష్ట్ర అసెంబ్లీలో కొన్ని సీట్లను రిజర్వ్​ చేయడం

ఆర్టికల్​ 334: 10ఏండ్ల వరకు రిజర్వేషన్​ పాటించడం(పలుమార్లు పొడిగించారు) 

ఆర్టికల్​ 371: ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు.


జాతీయ ఎస్సీ కమిషన్​

రాజ్యాంగంలోని 338 నిబంధన ప్రకారం ఏర్పాటు చేశారు. ఇది 2004, ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి వచ్చింది. ఈ కమిషన్​ రాజ్యాంగబద్ధమైంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. 

నిర్మాణం: చైర్మన్​, వైస్​ చైర్మన్​, ముగ్గురు సభ్యులు. సభ్యుల్లో ఒకరు మహిళా సభ్యురాలు తప్పకుండా ఉండాలి. కమిషన్​ సభ్యుల అర్హతలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు, తొలగిస్తారు. వీరు రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. కమిషన్​ చైర్మన్​, సభ్యుల కాల పరిమితి మూడేండ్లు. 

విధులు:

1. రాజ్యాంగపరంగా షెడ్యూల్డ్​ కులాలకు నిర్దేశించిన రక్షణలు, వాటి అమలు తీరును అధ్యయనం చేయడం
2.షెడ్యూల్డ్​ కులాల ఆర్థిక, సాంఘిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడం
3. ఎస్సీ హక్కుల ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను విచారించడం, కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు లేకుండా సుమోటోగా కేసులను విచారించవచ్చు. 
4. పౌర హక్కుల పరిరక్షణ చట్టం – 1955, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం – 1989 అమలు తీరుపైన విచారణ చేయడం 

నివేదిక: ఈ కమిషన్​ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి పార్లమెంట్​కు పంపిస్తారు. ఈ నివేదికలను పార్లమెంట్​లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ పరిశీలిస్తుంది. 

జాతీయ ఎస్టీ కమిషన్   

రాజ్యాంగంలోని 338(ఏ) ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్​ను ఏర్పాటు చేశారు. ఇది 2004, ఫిబ్రవరి 19 నుంచి అమలులోకి వచ్చింది. జాతీయ ఎస్టీ కమిషన్​ రాజ్యాంగబద్దమైంది. చైర్మన్​, వైస్​ చైర్మన్​, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు ఉండాలి. కమిషన్​ సభ్యుల అర్హతలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు, తొలగిస్తారు. వీరు రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. కమిషన్​ చైర్మన్​, సభ్యుల కాల పరిమితి మూడేండ్లు. 

విధులు

1. రాజ్యాంగం షెడ్యూల్డ్​ తెగలకు నిర్దేశించిన రక్షణల అమలు తీరును అధ్యయనం చేయడం
2. షెడ్యూల్డ్​ తెగ​ల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి తగిన సూచనలు చేయడం
3. అటవీ హక్కుల రక్షణ చట్టం (2006)ను అధ్యయనం చేసి, దానిని మరింతగా మెరుగపరిచి అమలు చేయడానికి తగిన సూచనలు చేయడం
4. రాష్ట్రపతి నిర్దేశించిన ఇతర విధులు 

నివేదిక: ఈ కమిషన్​ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి పార్లమెంట్​కు పంపిస్తారు. ఈ నివేదికలను పార్లమెంట్​లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ పరిశీలిస్తుంది.