స్కాలర్ షిప్ లు పెంచాలె : ఎంపీ ఆర్. కృష్ణయ్య

స్కాలర్ షిప్ లు పెంచాలె : ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా స్టూడెంట్ల స్కాలర్ షిప్ లు కూడా పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర బీసీ విద్యార్థి, యువజన సంఘాల అధ్యక్షులు నీల వెంకటేశ్, జిల్లాపల్లి అంజి నేతృత్వంలో సమావేశం జరిగింది. దానికి ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ఏపీలో విద్యార్థులకు  స్కాలర్ షిప్ కింద రూ.20 వేలు ఇస్తుంటే... మన రాష్ట్రంలో రూ.5,500 ఇస్తున్నారని గుర్తుచేశారు. 

ప్రస్తుతం పెరిగిన ధరలకు ఈ స్కాలర్ షిప్ సరిపోతుందా అని కృష్ణయ్య ప్రశ్నించారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ తదితర కాలేజీల్లోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్నట్లే బీసీ, ఈబీసీలకు కూడా ఫీజులు పూర్తిగా మంజూరు చేయాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్, ఎండీ లేకపోవడంతో శాఖ దిక్కులేనిదిగా మారిందని విమర్శించారు. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. బీసీ సంక్షేమ శాఖను బీసీ వ్యతిరేక శాఖగా మార్చారని మండిపడ్డారు.